Share News

అందుకే ‘క్రికెట్ కింగ్’ అయ్యాడు...

ABN , Publish Date - May 25 , 2025 | 11:08 AM

కనీసం మరో రెండేళ్లు ఆడే సత్తా ఉంది. ఇప్పటికీ జూనియర్ల కన్నా ఫిట్‌నెస్‌ ఎక్కువే..! ఫామ్‌ పర్వాలేదు. మరో 770 పరుగులు చేస్తే ప్రతీ బ్యాట్స్‌మన్‌ కలలుకనే అరుదైన పదివేల పరుగుల మైలురాయి దాటే అవకాశం ఉంది. ఇప్పటికే సీనియర్‌ సహచరుడు రోహిత్‌ శర్మ గుడ్‌ బై చెప్పేశాడు. అయినా ఏ సమీకరణమూ అతడి నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఆటపై తన దృక్ఫథం మారిన మరుక్షణం మళ్లీ మైదానంలో అడగుపెట్టనని ముందే చెప్పినట్టుగా... ఎలాంటి సందడి లేకుండా కోట్లాది అభిమానులను నివ్వెరపరుస్తూ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు ‘కింగ్‌’ కోహ్లి..

అందుకే ‘క్రికెట్ కింగ్’ అయ్యాడు...

విరాట్‌ కోహ్లీ.. మైదానంలోకి అడుగుపెట్టే సమయం.. అభిమానుల్లో ఉత్కంఠ రేగుతుంది. ఇక, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. అతని కళ్లలోకి చూస్తేనే చెప్పొచ్చు.. అది డేగ చూపు అని! అతడు ఛాతీ విరుచుకుని నడిచొస్తుంటే.. సింహం జూలు విదిల్చినట్లుంటుంది.. ఆట స్వరూపాన్ని మొత్తం మార్చేయగల సత్తా అతడికుంది. ఒక్కోసారి కోహ్లీ లేకపోతే మ్యాచ్‌ ఏమవుతుందోనన్న భయమూ కలుగుతుంది. భారత క్రికెట్‌లో కోహ్లీ ముద్ర చెరగనిది.

ఇక, ప్రపంచ క్రికెట్లోనే కాదు ... భారత్‌లోనూ కెరీర్‌ చరమాంకంలో రికార్డుల కోసం పాకులాడుతూ రిటైర్‌ కాకుండా జట్టుని పట్టుకొని వేలాడిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. అప్పటిదాకా అపురూప విన్యాసాలతో అలరించిన వారూ ... ఫామ్‌ కోల్పోయి చివర్లో ఫెయిల్‌ అయ్యారు. కానీ కోహ్లి ఆ కేటగిరి కాదు. తన పని పూర్తయిందనుకున్నాడు. ‘సైనింగ్‌ ఆఫ్‌ 269’ అంటూ ట్వీట్‌ చేసి అందరినీ నిర్ఘాంతపరిచాడు. భారత్‌ తరపున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన 269వ ఆటగాడు కోహ్లి.


book6.jpg

మరో కాంబ్లీ కాకుండా ...!

టీనేజ్‌లోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగిడిన కోహ్లి కెరీర్‌ ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. జట్టులో కుదురుకోవడానికి సమయం పట్టింది. ఒత్తిడిని తట్టుకోలేక పబ్‌లకు వెళ్లేవాడని ... ఆటకంటే తన వ్యక్తిగత అలంకరణ పైనే ధ్యాస ఎక్కువని విమర్శలొచ్చాయి. బ్యాటింగ్‌లో స్థిరత్వం కోల్పోవడంతో కెరీర్‌పైనే నీలినీడలు కమ్ముకున్నాయి. 1990వ దశకంలో ఉవ్వెత్తున ఎగిసి కుప్పకూలిన వినోద్‌ కాంబ్లీ దృష్టాంతం అందరికీ గుర్తుకు వచ్చింది. కానీ విరాట్‌ తన తప్పులను త్వరగానే సరిదిద్దుకున్నాడు. తాను ఏ దశ నుంచి వచ్చానో ఓసారి పునరావలోకనం చేసుకున్నాడు. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ సలహాలనూ స్వీకరించాడు. టెక్నిక్‌ను మెరుగు పరుచుకున్నాడు. ఒత్తిడిలో సక్సెస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాడు. అంతే... ఇక వెనుదిరిగి చూడలేదు. చేజింగ్‌లో చాంపియన్‌ అయ్యాడు. తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు.


ఫిట్‌నెస్‌ ... ఫస్ట్‌!

మూడేళ్ల ప్రాయం నుంచే బుడిబుడి నడకల కోహ్లికి క్రికెట్‌పై ఆసక్తి మొదలైంది. అది గమనించిన వాళ్ల నాన్న క్రికెట్‌ అకాడమీలో చేర్చించాడు. అంచనాలకు తగ్గట్టే రాణించిన కోహ్లి టీనేజ్‌లోనే రంజీ ... ఆపై అండర్‌-19 వరల్డ్‌కప్‌ విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ జాతీయ జట్టులో చేరిక తర్వాత ఫిట్‌నెస్‌ విషయంలో తడబడి వైఫల్యాలను ఎదుర్కొనక తప్పలేదు. తన ఫిట్‌నెస్‌ లోపాన్ని గ్రహించి అదే ఆయుధంగా మలుచుకొని శారీరక దృఢత్వానికి ‘ఐకాన్‌’గా నిలిచాడు కోహ్లి.

అది 2012 సంవత్సరం. విరాట్‌ ఇంకా జట్టులో యువ ఆటగాడే అయిన టీమిండియాను మెరికలా మార్చాలనుకున్నాడు. అది జరగాలంటే తాను తప్పక మారాలి. అందుకే జట్టు ఫిట్‌నెస్‌ కోచ్‌ శంకర్‌ బాసుని ఆశ్రయించాడు. ఆస్ర్టేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ క్రికెటర్లకు ఫిట్‌నెస్‌ విషయంలో తామేమీ తీసిపోమని నిరూపించుకోవాలని భావించాడు కోహ్లి.

‘అందుకు తగ్గట్టే మూస పద్ధతుల్ని విడనాడి కఠోర కసరత్తులతో అత్యంత దృఢమైన క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లి ప్రేరణతో భారత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ స్వరూపమే మారిపోయింది. యువ ఆటగాళ్లంతా పరిపూర్ణమైన ఫిట్‌నెస్‌తో దృఢత్వాన్ని సాధించారు.


యువీ మాటలతో ...!

2008లో వన్డే జట్టులోకి వచ్చిన కోహ్లి తొలి మూడేళ్లు ఇబ్బందులనే ఎదుర్కొన్నాడు. అద్భుతమైన ప్రతిభ తన అమ్ములపొదిలో ఉన్నా ... ఆరంభంలో తడబడ్డాడు విరాట్‌. 2009లో తన అలవాట్లు ... వ్యక్తిగత క్రమశిక్షణపై పుకార్లు షికార్లు చేశాయి. ఈ దశలో ఏం చేయాలో కుర్ర కోహ్లికి బోధపడ లేదు. సహచర పంజాబీ ఆటగాడు యువరాజ్‌ ... కోహ్లికి దిక్సూచిలా మారాడు. యువీ సూటిగా ఒకటే మాట చెప్పాడు.

book7.2.jpg

‘నువ్వు ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా నిలవాలంటే నన్ను ఆదర్శంగా తీసుకోకు. నన్ను అనుకరించకు.. సచిన్‌ను స్ఫూర్తిగా తీసుకో. క్రమశిక్షణలో అతడిని మించిన వారు లేరు’ ... అంటూ యువీ ఉద్భోదించిన తీరు కోహ్లిపై గణనీయ ప్రభావం చూపింది. అప్పటి నుంచీ అతని ఆటలో అద్భుతమైన మార్పు వచ్చిందని చెప్పవచ్చు.


నాన్నకు నివాళి

కోహ్లి మేటి క్రికెటర్‌ అవ్వాలన్నది అతడి తండ్రి ఆశయం. అందుకు తొలి అడుగుగా 2006 రంజీ సీజన్‌లో ఢిల్లీ తరపున ఆడే అవకాశం విరాట్‌కు దక్కింది. 18 ఏళ్ల ప్రాయంలో దేశవాళీల్లో అడుగిడిన కోహ్లికి కెరీర్‌ తొలినాళ్లలోనే వ్యక్తిగతంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. కర్ణాటకతో రంజీ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కోహ్లి నాన్న ప్రేమ్‌నాథ్‌ కోహ్లీ అకస్మాత్తుగా మరణించాడు. ఓ వైపు తండ్రి నిష్క్రమణ ... మరోవైపు నాన్న ఆశయానికి తొలిమెట్టు ... ఏదేమైనా ఆయన కోరుకున్న విధంగా ... బ్యాట్‌తోనే ఆయనకు ఘననివాళి అర్పించాలని బరిలోకి దిగాడు. పంటి బిగువున బాధ భరిస్తూ 90 పరుగులతో రాణించాడు.

మధ్యతరగతి నుంచి ...!

విరాట్‌ది సాధారణ మధ్య తరగతి కుటుంబం. తండ్రి లాయర్‌ కాగా తల్లి గృహిణి. ఒకానొక దశలో ఇంటి అద్దె కూడా చెల్లించలేని ఆర్థిక దుస్థితి. ఈ ఇబ్బందుల్ని కళ్లారా చూసిన చిన్నారి కోహ్లి ఆటతో అందనంత ఎత్తుకు ఎదగాలని బాల్యంలోనే దృఢంగా నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లే శ్రమించాడు. ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఏడాదికి రూ. 300 కోట్లు పైచిలుకు ఆదాయాన్ని వాణిజ్య ఒప్పందాల ద్వారానే గడిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో రెస్టారెంట్లు, హెల్త్‌క్లబ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లతో వ్యాపారాన్నీ విస్తరించాడు.


అదే నిబద్ధత

‘ఓసారి ఫ్రాంచైజీని నమ్ముకున్నాక ... ఆ యాజమాన్యం మనపై అంతులేని అభిమానం చూపించాక... లాభమో ... నష్టమో ఇక ఆ జట్టుని విడిచి వెళ్లలేను. డబ్బులు ఇక్కడ ప్రాధాన్యం కాదు. బంధం ముఖ్యం’. ఐపీఎల్‌లో తన జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై కోహ్లి అభిప్రాయమిది. ఐపీఎల్‌ ఆరంభమైన 2008 నుంచి విరాట్‌ బెంగళూరును వీడలేదు. వేలంలో పాల్లొన లేదు. ఇప్పటివరకు రాయల్‌ చాలెంజర్స్‌ ఒక్క ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గకున్నా ... తనపై ఎన్నో విమర్శలు వచ్చినా ... వేలానికి వస్తే అధిక ధర ఇస్తామన్నా కోహ్లి చలించలేదు. ఇదీ ‘కింగ్‌’ నిబద్ధతకు ప్రత్యక్ష తార్కాణం.

book7.3.jpg

సంధి దశలో అండగా...!

గవాస్కర్‌, కపిల్‌దేవ్‌, శ్రీకాంత్‌, మదన్‌లాల్‌ ... 80వ దశకం నాటి కూర్పు. సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌, సెహ్వాగ్‌, లక్ష్మణ్‌ 2000వ దశకంలో భారత జట్టుకు వెన్నెముక. కానీ కోహ్లి జట్టులో కుదురుకునే నాటికి సీనియర్ల నిష్క్రమణతో భారత్‌ క్రికెట్‌ సంధి దశలో ఉంది. ధోని మినహా అనుభవజ్ఞులు లేని స్థితి. ఇలాంటి క్లిష్ణ పరిస్థితుల్లోనూ కోహ్లి బ్యాట్స్‌మన్‌గానే కాదు నాయకుడిగానూ అదరగొట్టాడు. భారత్‌ టెస్టు క్రికెట్‌కు దూకుడు నేర్పించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు కళ తెచ్చాడు. 12ఏళ్ల పై చిలుకు కెరీర్‌లో ఎందరో బ్యాట్స్‌మెన్‌లు వచ్చారు ... పోయారు. కానీ కుదురుగా నిలిచింది కోహ్లి ఒక్కడే. అంతేకాదు. కీలకమైన నాలుగో స్థానంలో జట్టుకు ఆధారంగా నిలిచిందీ అతడే.


ఫలితం కోసమే ప్రయత్నం

సాధారణంగా టెస్టుల్లో ఏమాత్రం పరిస్థితి అనుకూలంగా లేకున్నా ‘డ్రా’ కోసమే జట్లు ప్రయత్నిస్తాయి. కానీ కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ అమీతుమీ తేల్చుకోవడానికే ప్రయత్నించింది. లక్ష్యం ఎంతైనా సరే... డ్రా కాదు ఫలితమే కావాలి ... అది విజయమైనా ... ఓటమైనా అనేలా జట్టును ప్రేరేపించాడు. అందుకే ఏనాడూ ఆస్ర్టేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గని టీమిండియా ఆ అరుదైన ముచ్చటను 2018-19 సీజన్లో తీర్చుకుంది.

ఇంగ్లండ్‌కు వెళ్లకుండానే..

రోహిత్‌ టెస్టు కెరీర్‌పై సందేహమున్నా ... కోహ్లి మాత్రం ఖచ్చితంగా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్తాడని అందరూ భావించారు. ఆస్ర్టేలియా టూర్‌లో వైఫల్యానికి ఇంగ్గండ్‌లో బదులివ్వాలని విరాట్‌ కూడా అనుకున్నాడు. మరి బీసీసీఐ ఒత్తిడో లేక కోచ్‌ గంభీర్‌ అయిష్టత వల్లనో మొత్తానికి ఈ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ మైదానంలో సరైన గౌరవం పొందకుండానే సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి తప్పుకున్నాడు. ఇలా.. కోహ్లీ తన క్రికెట్‌ జీవితంలో ప్రతీ దశలోనూ పట్టుదలతో ఆడాడు. మొండిగా పోరాడాడు. తనూ గెలిచాడు.. ఇండియాను కూడా అనేకసార్లు గెలిపించాడు. ఒక్కమాట లో చెప్పాలంటే కోహ్లీ.. కోట్ల అభిమానుల హృదయస్పందన!

- మట్టపల్లి రమేష్‌,

99893 78412


వీగన్‌ .... విరాట్‌

కోహ్లి భోజనప్రియుడు. చికెన్‌ అంటే ప్రాణం. కానీ ఫిట్‌నెస్‌ దృష్ట్యా కోచ్‌ సలహాతో 2018 నుంచి పూర్తి శాకాహారిగా మారాడు. పౌష్టికాహారం విషయంలో అతడు అస్సలు రాజీ పడడు. అదే అతడి ఆరోగ్య రహస్యం.

book7.4.jpg

ఆ నెంబర్‌ ... భావోద్వేగం!

కోహ్లి జెర్సీ నెంబర్‌కు ... అతడి వ్యక్తిగత జీవితానికి గాఢమైన అనుబంధం ఉంది. 18 ఏళ్ల వయసులో డిసెంబర్‌ 18, 2006లో విరాట్‌ తండ్రి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఆ విషాద తేదికి గుర్తుగా ... జీవితాంతం తన తండ్రి స్ఫురణకు వచ్చేలా కోహ్లి తన జెర్సీ నెంబర్‌ ‘18’ని ఎంచుకున్నాడు.

అన్నింట్ల్లోనూ భాగస్వామ్యం

తన సారథ్యంలో అండర్‌-19 వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించిన కోహ్లి ... 2011 వన్డే వరల్డ్‌ కప్‌ విజేత బృందంలో సభ్యుడు. చాంపియన్స్‌ ట్రోఫీ (2013, 2025) విజయాలతో పాటు, నిరుడు టీ 20 ప్రపంచకప్‌ నెగ్గడంలోనూ కోహ్లి కీలక ప్రాత పోషించాడు.


రికార్డుల మోత..

40 - కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా నెగ్గిన టెస్టులు. అత్యంత విజయవంతమైన భారత్‌ సారధి కోహ్లినే. అదీ టెస్టుల్లో కెప్టెన్‌గా 40 విజయాలు.

7 - టెస్టుల్లో అత్యధిక ద్విశతకాలు సాధించిన భారత్‌ బ్యాట్స్‌మన్‌.

254 - టెస్టుల్లో విరాట్‌ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన.

5864 - భారత్‌ కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన కోహ్లి.

20 - టెస్టులో భారత్‌ సారధిగా అత్యధిక సెంచరీలు.

ఇక వన్డేల్లోనే!

గతేడాది టి20లకు గుడ్‌బై చెప్పిన విరాట్‌ తాజాగా టెస్టులకు వీడ్కోలు పలికాడు. దీంతో ఇక వన్డేల్లోనే ఈ కింగ్‌ మెరుపులు చూడొచ్చు. 2027 వన్డే ప్రపంచకప్‌లోనూ కోహ్లి ఆడి తన ఘనమైన కెరీర్‌కు సగౌరవమైన ముగింపు పలకాలన్నది అభిమానుల కొండంత ఆశ. మరి ఆ కల నెరవేరుతుందో లేదో కాలమే చెప్పాలి.


అనుష్క రాకతో ...

బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మతో చాలాకాలం చెట్టాపట్టాలేసుకొని తిరిగిన కోహ్లి 2017లో ఓ ఇంటివాడయ్యాడు. తన చురుకైన చేష్టలతో అటు ప్రేక్షకులు ... ఇటు ఆటగాళ్లలోనూ నిరంతరం ఉత్సాహం నింపే విరాట్‌ అనుష్క రాకతో తన జీవన గమనాన్ని మార్చుకున్నాడు. మైదానంలో దూకుడుగా ... వ్యక్తిగతంగా అత్యంత ప్రశాంతంగా ఉండేలా అనుష్క విరాట్‌ను తీర్చిదిద్దింది. ఆధ్యాత్మిక తత్వాన్ని అలవాటు చేసి ఎప్పటికప్పుడు కోహ్లి దుందుడుకు స్వభావాన్ని నియంత్రించడంలో అనుష్క పాత్ర కీలకం. అందుకే మైదానంలో శతకం బాదగానే తొలి అభివాదం అనుష్కకే వెళుతుంది.


అది 2009 సంవత్సరం ... విశాఖపట్నంలో దేశవాళీ టోర్నీ. ప్రాక్టీస్‌ కోసమని గౌతమ్‌గంభీర్‌తో పాటు మరికొందరు భారత్‌ సీనియర్‌ క్రికెటర్లూ ఆ టోర్నీలో పాల్గొంటున్నారు. ఓ 20 ఏళ్ల కుర్రాడు మైదానంలో పాదరసంలా కదులుతూ హల్‌చల్‌ చేస్తున్నాడు. ప్రాక్టీస్‌తో పాటు తన అల్లరితో సహచరుల్ని ఉత్సాహపరుస్తున్నాడు. కేవలం అతడి ఇంటర్వ్యూ కోసమే హైదరాబాద్‌ నుంచి నేను (వ్యాసరచయిత) విశాఖ వెళ్లాను. నాలుగు గంటల సాధన తర్వాత నా విజ్ఞప్తిని మన్నించి ఆ కుర్రాడు నాతో ముచ్చటించాడు. ఆటపై అతనికున్న దృక్ఫథం ... ఇతరత్రా ఎన్నో అంశాలు మాట్లాడాడు. ఆ ఇంటర్వ్యూ సారాంశం ... ఆ యువ క్రికెటర్‌ మనోగతం ఒక్కటే. ‘తాను ఎప్పటికైనా ప్రపంచ నెంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ కావాలన్న’దే ఆశయం. అతని ప్రతీ మాటలో ఆ పట్టుదల అప్పుడే కనిపించింది. అన్నట్టుగానే శ్రమించాడు. విశ్వ క్రికెట్‌ను శాసించాడు. దిగ్గజంగా నిలిచాడు. ఆ నాటి కుర్రాడే... భారత్‌ క్రికెట్‌ ‘కింగ్‌’ విరాట్‌ కోహ్లి.


ఈ వార్తలు కూడా చదవండి.

భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి

Hyderabad Metro: పార్ట్‌-బీ మెట్రోకు డీపీఆర్‌ సిద్ధం

Read Latest Telangana News and National News

Updated Date - May 25 , 2025 | 11:08 AM