Jharkhand win: SMAT 2025 ఛాంపియన్‌గా జార్ఖండ్
ABN , Publish Date - Dec 18 , 2025 | 09:20 PM
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 టైటిల్‌ను జార్ఖండ్ కైవసం చోసుకుంది. హరియాణాతో గురువారం నాటి ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) 2025 ఛాంపియన్‌గా జార్ఖండ్ జట్టు నిలిచింది. హరియాణాతో జరిగిన ఫైనల్‌లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేకాక జార్ఖండ్‌కు ఈ టోర్నీ తొలి టైటిల్ ఇదే. టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 262 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్, ఓపెనర్ ఇషాన్ కిషన్ (49 బంతుల్లో 101 పరుగులు) సూపర్ సెంచరీ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా (38 బంతుల్లో 81 పరుగులు) మెరుపులు మెరిపించాడు.
అనంతరం భారీ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన హరియాణా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. యశ్వర్ధన్ దలాల్ (53), సమంత్ జాఖర్ (38), నిశాంత్ సింధు (31) దూకుడుగా ఆడి.. హరియాణాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. అయితే.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో హరియాణాకు ఓటమి తప్పలేదు. జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా 3, బాలకృష్ణ 3, వికాష్ సింగ్, అనుకుల్ రాయ్ రెండేసి వికెట్లు తీశారు.
పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన హరియాణా.. జార్ఖండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇషాంత్ భరద్వాజ్‌ను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు బాదాడు. సుమిత్ కుమార్ వేసిన వరుస ఓవర్లలో కుశాగ్రా నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు. ఈ క్రమంలోనే కిషన్ 24 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అంశుల్ కాంబోజ్ వేసిన 14వ ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ కొట్టి 90ల్లోకి వచ్చేశాడు. అదే ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్స్ రాబట్టి సెంచరీ (45 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు.
దీంతో జార్ఖండ్ 14 ఓవర్లకు 180/1తో నిలిచింది. చివర్లో అనుకుల్ రాయ్ (40* 20 బంతుల్లో), రాబిన్ మింజ్ (31* 14 బంతుల్లో) దూకుడుగా ఆడారు. ఈ జోడీ 29 బంతుల్లో 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించింది. మొత్తంగా హరియాణా ముందు 263 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచగా.. ఆ జట్టు కేవలం 193 పరుగులు మాత్రమే చేసింది. కాగా గతంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2010-11 టైటిల్ గెలుచుకున్న జార్ఖండ్.. తాజాగా ఇషాన్ కిషన్ సారథ్యంలో ఈ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్ వివాదం.. స్పందించిన ఐసీసీ