Jasprit Bumrah: 'మరుగుజ్జు కదా!’.. బుమ్రా కామెంట్స్‌పై స్పందించిన సౌతాఫ్రికా కోచ్
ABN , Publish Date - Nov 15 , 2025 | 08:25 AM
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బవుమాపై టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చేసిన కామెంట్స్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా సౌతాఫ్రికా కోచ్ స్పందించారు
భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శుక్రవారం తొలి టెస్ట్ ప్రారంభమైంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్(Eden Gardens Test) వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రారంభం నుంచే సౌతాఫ్రికా బ్యాటర్లపై నిప్పులు చెరిగాడు. అద్భుతమైన బంతులతో సఫారీ జట్టును కకావికలం చేశాడు. వేగంగా ఆడుతూనే.. క్రీజులో పాతుకుపోవాలని ప్రయత్నించిన ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (48 బంతుల్లో 31), రియాన్ రికెల్టన్ (22 బంతుల్లో 23)లను త్వరగానే ఔట్ చేశాడు.
అంతేకాదు.. టోనీ డి జోర్జి ( 24), సైమన్ హార్మర్ (5), కేశవ్ మహరాజ్ (0)లను కూడా అవుట్ చేసిన బుమ్రా.. మొత్తంగా ఐదు వికెట్లు సాధించాడు. బుమ్ర విరుచుకపడటంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో ఈ రైటార్మ్ పేసర్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే సమయంలో బుమ్రా ప్రోటీస్ జట్టు కెప్టెన్ తెంబా బవుమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికా(South Africa) స్కోరు 62/2 వద్ద ఉన్న సమయంలో బవుమా క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో బవుమాకు బుమ్రా అద్భుతమైన బంతిని సంధించాడు. ఆ బంతిని ఎదుర్కొనే క్రమంలో బవుమా డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బాల్ అతడి ప్యాడ్‌కు తాకింది.
దీంతో బుమ్రాతో పాటు టీమిండియా ఫీల్డర్లు కూడా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేయగా.. అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. అయితే, బుమ్రా మాత్రం కచ్చితంగా బంతి వికెట్లను గిరాటేస్తుందన్న నమ్మకంతో .. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో చర్చించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే బుమ్రా.. ‘క్రీజులో ఉన్నది అసలే మరుగుజ్జు కదా!’ అంటూ ఒక రకంగా బవుమాను ఎగతాళి చేస్తూ బౌలింగ్ చేసేందుకు వెళ్లాడు. దీంతో బుమ్రా మాటలు స్టంప్ మైకు(Bumrah stump mic comment)లో రికార్డయ్యాయి.
బుమ్రా చేసి ఈ వ్యాఖ్యలపై సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ యాష్‌వెల్ ప్రిన్స్ తాజాగా స్పందించాడు. ‘ఈ విషయం గురించి మా జట్టులో ఎలాంటి చర్చా రాలేదు. భారత్ నుంచి ఇలా జరగడం ఇదే తొలిసారి. అయితే, అక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదనే అనుకుంటున్నా’ అంటూ మీడియా ముందు వెల్లడించాడు. ఏదేమైనా బుమ్రా తీరుకు బవుమా, అతడి ఫ్యాన్స్ నొచ్చుకున్నారన్నది మాత్రం నిజమేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు బుమ్రా(Jasprit Bumrah) తీరు సరికాదంటూ విమర్శల వర్షం కురిపించారు. మరికొందరు మాత్రం సరదాగా అన్న మాటలను అపార్థం చేసుకోవద్దని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి:
Indias Bowlers Dominated: బుమ్రా ధాటికి విలవిల
మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి