Indias Bowlers Dominated: బుమ్రా ధాటికి విలవిల
ABN , Publish Date - Nov 15 , 2025 | 03:58 AM
ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 5 27 ధాటికి వరల్డ్ టెస్టు చాంపియన్ సౌతాఫ్రికా విలవిల్లాడింది....
ఐదు వికెట్లతో అదుర్స్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 159 ఆలౌట్
భారత్ మొదటి ఇన్నింగ్స్ 37/1
కోల్‌కతా: ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (5/27) ధాటికి వరల్డ్ టెస్టు చాంపియన్ సౌతాఫ్రికా విలవిల్లాడింది. శుక్రవారం ఆరంభమైన ఈ తొలి టెస్టులో ఇతర బౌలర్లు కూడా ప్రభావం చూపడంతో సఫారీలు తమ తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లే ఆడి కేవలం 159 పరుగులకు కుప్పకూలారు. ఓపెనర్ మార్‌క్రమ్ (31), ముల్డర్ (24), జోర్జి (24), రికెల్టన్ (23) ఫర్వాలేదనిపించారు. పేసర్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీ్‌పలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది. పిచ్ బౌలర్లకు సహకరించడంతో భారత్‌కు కూడా పరుగులు రావడం కష్టంగా మారింది. జైస్వాల్ (12) ఏడో ఓవర్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రాహుల్ (59 బంతుల్లో 13 బ్యాటింగ్), వన్‌డౌన్ బ్యాటర్ సుందర్ (38 బంతుల్లో 6 బ్యాటింగ్) జాగ్రత్తగా ఆడగా, వెలుతురులేమితో మ్యాచ్‌ను 15 ఓవర్లు ముందుగానే ముగించారు. సాయి సుదర్శన్‌ను పక్కనబెట్టి ఆల్‌రౌండర్ అక్షర్‌ను తీసుకోవడంతో భారత జట్టు నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగినట్టయ్యింది.
ఆరంభం బాగున్నా..: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభమైంది. ముందుగా ఓపెనర్ రికెల్టన్ వన్డే తరహాలో ఆడేస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. మార్‌క్రమ్ మాత్రం ఖాతా తెరిచేందుకు 23 బంతులు తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత బౌండరీలతో జోరు చూపాడు. అక్షర్‌ను లక్ష్యం చేసుకుని ఎదురుదాడికి దిగాడు. వీరి ధాటికి తొలి పది ఓవర్లలోనే స్కోరు 57కి చేరింది. ఈ క్రమంలో 2008 తర్వాత భారత్‌లో తొలి వికెట్‌కు 50+ భాగస్వామ్యం అందించగలిగారు. అటు పేసర్ బుమ్రా మాత్రం కొత్త బంతితో బౌన్స్‌ను రాబట్టి రన్స్‌ను కట్టడి చేయగలిగాడు. వికెట్లను లక్ష్యం చేసుకుని బంతులు విసిరిన బుమ్రా ప్రయత్నం 11వ ఓవర్‌లో ఫలించింది. ఓ చక్కటి లెంగ్త్ బాల్‌తో రికెల్టన్‌ను బౌల్డ్ చేశాడు. తన తర్వాతి ఓవర్‌లోనే ఎక్స్‌ట్రా బౌన్స్‌తో మార్‌క్రమ్‌ను కూడా దెబ్బతీశాడు. కుడిపక్కకు డైవ్ చేస్తూ కీపర్ పంత్ సూపర్ క్యాచ్ తీసుకున్నాడు. అటు స్పిన్నర్ కుల్దీప్ తన రెండో ఓవర్‌లోనే కెప్టెన్ బవుమా (3)ను అవుట్ చేశాడు. అనంతరం ముల్డర్, డి జోర్జి ఓపిగ్గా ఆడి 105/3 స్కోరు దగ్గర తొలి సెషన్‌ను ముగించారు.
బౌలర్ల హవా: రెండో సెషన్‌లో భారత బౌలర్లు మరింత బెంబేలెత్తించారు. చక్కగా కుదురుకున్న ముల్డర్‌ను కుల్దీప్, జోర్జిని బుమ్రా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేర్చారు. దీంతో 120/5 స్కోరుతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో స్టబ్స్ కాస్త పోరాటం చూపినా.. మరో ఎండ్‌లో అతడికి సహకారం కరువైంది. బంతి పాతదిగా మారాక సిరాజ్ 45వ ఓవర్‌లో వెరీన్ (16), యాన్సెన్ (0)ల వికెట్లు తీయగా.. టీ బ్రేక్‌కు ముందు ఓవర్‌లో బాష్ (3)ను అక్షర్ అవుట్ చేశాడు. దీంతో ఈ సెషన్‌లో ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 49 పరుగులు మాత్రమే జోడించింది. ఇక ఆఖరి సెషన్ మూడో ఓవర్‌లోనే బుమ్రా మిగిలిన రెండు వికెట్లను పడగొట్టి కెరీర్‌లో 16వ సారి ఐదు వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
సాయి సుదర్శన్‌కు చోటేది?: కుంబ్లే
బ్యాటర్ సాయి సుదర్శన్‌కు జట్టులో చోటు కల్పించకపోవడాన్ని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తప్పుపట్టాడు. ఏకంగా ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లను ఆడించడాన్ని కూడా ప్రశ్నించాడు. టీమిం డియా చరిత్రలో గతంలో ఎప్పుడూ ఇలా ఆరుగురు లెఫ్టాండర్లను ఆడించలేదు.