India vs Pakistan U17: మళ్లీ అదే జోష్, రెచ్చగొట్టిన పాక్ ఆటగాళ్లు..గెలిచి చూపించిన భారత్
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:39 PM
ఇండియా vs పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య పోటీ ఏదైనా ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లలో కూడా అదే తీరు కనిపించగా, తాజాగా సాఫ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో కూడా అలాగే జరిగింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇండియా vs పాకిస్తాన్ (India vs Pakistan) మ్యాచ్ అంటే చాలు. అది క్రికెట్ సహా ఏ క్రీడ అయినా కూడా జనాల్లో ఆసక్తి ఉంటుంది. ఫుట్‌బాల్ కావచ్చు, పింగ్ పాంగ్ అయినా సరే రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే రసవత్తరంగా మారుతుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025లో కూడా అదే తీరు కనిపించింది. ఇప్పుడు తాజాగా SAFF U17 ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భారత్-పాక్ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది.
కొలంబోలోని రేస్‌కోర్స్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన SAFF U17 ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో భారత్ 3-2 స్కోరుతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన తర్వాత జరిగినప్పటికీ, ఆటలో మాత్రం ఉత్కంఠ తగ్గలేదు. మ్యాచ్‌లో భారత్ తరఫున డల్లల్‌మున్ గంగ్టే 31వ నిమిషంలో గోల్ కొట్టి ఆధిక్యం సాధించాడు. దానికి సమాధానంగా, పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్ అబ్దుల్లా 43వ నిమిషంలో పెనాల్టీ ద్వారా గోల్ చేసి స్కోరును సమం చేశాడు.
అదే సమయంలో అబ్దుల్లా గోల్ సెలబ్రేషన్ వివాదానికి కారణమైంది. అతను కార్నర్‌కు వెళ్లి, తన సహచరులతో కలిసి కూర్చుని టీ తాగుతున్నట్టు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సెలబ్రేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. భారత ఆటగాళ్లు దీన్ని సీరియస్‌గా తీసుకుని, మరింత ఉత్సాహంతో ఆడారు. డానీ సింగ్ వాంగ్‌ఖెమ్ వింగ్‌లో దూసుకెళ్లి, పాక్ డిఫెండర్‌ను దాటి కచ్చితమైన పాస్ ఇచ్చాడు.
ఆ బంతిని గంగ్టే అద్భుతంగా గోల్‌గా మలిచి, భారత్‌కు మళ్లీ ఆధిక్యాన్ని అందించాడు. దీంతో భారత్ 3-2 స్కోరుతో విజయం సాధించి, పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. దీనికి ముందు ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య గ్రూప్ స్టేజ్, ఆదివారం దుబాయ్‌లో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లు కూడా ఉత్కంఠ రేపాయి. పాకిస్తాన్ క్రికెటర్లు హారిస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఆటలో భాగంగా రెచ్చగొట్టే సంజ్ఞలు చేయడం, ఆ తర్వాత భారత ఆటగాళ్లు విజృంభించి ఆడటం కనిపించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి