Share News

Cyber Scam: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన కేటుగాళ్లు..రూ.23 కోట్ల చీటింగ్

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:46 AM

దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు వేగంగా పుంజుకుంటున్నాయ్. ఈ క్రమంలో వృద్ధులను ప్రధానంగా లక్ష్యంగా తీసుకుని వారి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

Cyber Scam: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన కేటుగాళ్లు..రూ.23 కోట్ల చీటింగ్
Cyber Scam

దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు, ముఖ్యంగా వృద్ధులను టార్గెట్ చేస్తూ, వారి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మోసానికి మరో వ్యక్తి (Cyber Scam) బలయ్యారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

మాజీ బ్యాంక్ అధికారి..

ఢిల్లీలోని (Delhi) గుల్మోహర్ పార్క్‌లో నివసించే మాజీ బ్యాంక్ అధికారి నరేష్ మల్హోత్రా ఈ డిజిటల్ మోసానికి బలయ్యారు. ఆగస్టు 1, 2025న ఆయనకు ఒక కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను ఎయిర్‌టెల్ నుంచి మాట్లాడుతున్నానని, ముంబై పోలీసులతో కనెక్ట్ చేస్తానని చెప్పాడు. నరేష్ ఆధార్ నంబర్ ఆధారంగా ముంబైలో కొత్త ఫోన్ నంబర్ జారీ అయ్యిందని, ఆ నంబర్‌ను ఉగ్రవాద నిధుల కోసం ఉపయోగించారని ఆరోపించారు. కాల్ డిస్‌కనెక్ట్ చేస్తే ఆయన ఫ్యామిలీలో అన్ని ఫోన్ లైన్లు కట్ చేస్తామని బెదిరించారు.


డిజిటల్ అరెస్ట్‌తో భయపెట్టి మోసం

మోసగాళ్లు నరేష్‌ను వాట్సాప్ కాల్స్ ద్వారా సంప్రదించారు. ఆయన ఆధార్ నంబర్ ద్వారా జారీ చేసిన నంబర్‌ను జూదం, ఉగ్రవాద నిధులకు ఉపయోగించారని, దీని కారణంగా ఆయనపై PMLA చట్టం అమలు చేస్తామని బెదిరించారు. నరేష్ తన కుటుంబానికి ఈ విషయం చెబితే, వారందరినీ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.


వివిధ ఖాతాలకు..

ఈ బెదిరింపులతో భయపడిన నరేష్, సోమవారం RTGS ద్వారా రూ.1.4 మిలియన్లను (రూ. 12,41,51,447), ఆ తర్వాత సెప్టెంబర్ 4 వరకు షేర్లను అమ్మి మొత్తం రూ.23 కోట్లను వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. మోసగాళ్లు RTGS ఫారమ్‌లు పంపి, డబ్బు బదిలీ చేయమని ఆదేశించారు. బ్యాంక్ ఉద్యోగులు కూడా ఇంత పెద్ద మొత్తం ఎందుకు విత్‌డ్రా చేస్తున్నారని అడిగినప్పటికీ, ED దర్యాప్తు జరుగుతోందని, అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో నరేష్ డబ్బు బదిలీ చేశారు.


నకిలీ సుప్రీంకోర్టు ఆదేశాలు

అదే సమయంలో మోసగాళ్లు నరేష్‌కు ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి కూడా నకిలీ ఆదేశాలను పంపారు. RBI అనుమతితో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ బ్యాంకుకు డబ్బు బదిలీ చేయమని ఆదేశించారు. నరేష్ మొదట ఈ బదిలీని నిరాకరించినప్పటికీ, నకిలీ సుప్రీంకోర్టు ఆదేశాలను చూసి భయపడి డబ్బును నాలుగు వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. చివరకు, ఆయన సుప్రీంకోర్టుకు వ్యక్తిగతంగా రూ.5 కోట్ల చెక్కు ఇస్తానని చెప్పడంతో మోసగాళ్లు కాల్‌ను డిస్‌కనెక్ట్ చేశారు.

ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు

దీంతో అనుమానం వచ్చి సెప్టెంబర్ 19న నరేష్ ఢిల్లీ పోలీసులు, సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసాలకు బ్యాంకులు కూడా బాధ్యత వహించాలని నరేష్ అభిప్రాయపడ్డారు. కేవలం వెయ్యి రూపాయల బ్యాలెన్స్ ఉన్న ఖాతాకు కోట్ల రూపాయలు వస్తే, బ్యాంకులు, RBI దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు. కేవైసీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ఇటువంటి మోసాలను నిరోధించవచ్చని ఆయన అన్నారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 23 , 2025 | 11:50 AM