Diana Edulji: ఇది చిరస్మరణీయ రోజు: డయానా ఎడుల్జీ
ABN , Publish Date - Nov 04 , 2025 | 09:41 AM
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా తొలి సారిగా ఐసీసీ ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా తొలి సారిగా ఐసీసీ ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎడుల్జీ ఈ ఘట్టాన్ని ‘చరిత్రలో చిరస్మరణీయమైన రోజు’గా అభివర్ణించారు. ఈ విజయం తమకు 1983లో పురుషుల జట్టు సాధించిన ప్రపంచకప్ విజయం లాంటిదని ఆమె వ్యాఖ్యానించారు.
50 ఏళ్ల కృషికి ఫలితం!
‘నిజంగా ఇదొక చరిత్రాత్మకమైన రోజు. నేనొక మహిళా క్రికెటర్‌గా చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నాను. గత 50 ఏళ్లుగా చేసిన కృషికి ఫలితం లభించింది. అమ్మాయిలు ఈ ప్రపంచకప్‌ను గెలిచినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. వారు అందరి ప్రశంసలకు అర్హులు. వారు అద్భుతమైన క్రికెట్ ఆడారు. ముఖ్యంగా ఫైనల్‌లో నిజమైన ఛాంపియన్లలా ఆడారు’ అని ఎడుల్జీ అన్నారు.
అలుపెరుగని పోరాటం..
టీమిండియా ప్లేయర్లంతా గెలవాలని కసితో ఆడారు. వారిలో ఉన్న గెలుపు దాహం గురించి ఎడుల్జీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘వారు ఈ విజయం కోసం ఎంతగానో ఆరాటపడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. 2017 నుంచి టీమిండియా గెలుపు అంచు వరకు ఓడిపోతుంది. ఈ సారి ఆ గీతను దాటాలని తపించారు. 2017లో కోచ్‌గా ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు కేవలం ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయిన రోజు నాకు ఇంకా గుర్తుంది. కానీ ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
వారికి ప్రత్యేక అభినందనలు..
‘ముఖ్యంగా షెఫాలీ వర్మ, రిచా ఘోష్ గురించి చెప్పాలి. అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఇది సుదీర్ఘమైన ప్రయాణం. వీరిద్దరూ అండర్-19 ప్రపంచకప్‌ను గెలిచారు. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ కూడా గెలవడం చాలా ఆనందంగా ఉంది. వారికి ఇది చాలా మధురమైన క్షణం’ అని ఎడుల్జీ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!
Read Latest AP News And Telugu News