Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:21 PM
ప్రపంచ కప్ గెలవడంలో ప్రతి ఒక్క ప్లేయర్ కీలక పాత్ర పోషించారు. ఇందులో మన తెలుగు బిడ్డ నల్లపురెడ్డి శ్రీ చరణి కూడా భాగమైంది. ఇదే ఆమెకు తొలి ప్రపంచ కప్. అరంగేట్రంలోనే అద్భుతం చేసింది. 9 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టి టాప్ 5 బౌలర్లలో నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా జట్టు.. ఒకానొక దశలో సెమీస్‌లోకి అడుగుపెట్టడమే కష్టంగా మారింది. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా బలమైన ప్రత్యర్థి ఆసీస్‌నే బోల్తా కొట్టించారు. అదీనూ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి! ఎట్టకేలకు ఫైనల్‌లో అడుగుపెట్టారు. ఓ వైపు వర్షం అంతరాయం.. మరో వైపు ప్రపంచ్ కప్ ముద్దాడాలనే ఆశయం. ఈ రెండింట్లో టీమిండియా ఆశయమే గెలిచింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దింపుతూ తొలిసారి వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ(India Women World Cup 2025)ని ముద్దాడింది. ఆదివారం నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
బౌలింగ్.. అమోఘం!
ప్రపంచ కప్ గెలవడంలో ప్రతి ఒక్క ప్లేయర్ కీలక పాత్ర పోషించారు. ఇందులో మన తెలుగు బిడ్డ నల్లపురెడ్డి శ్రీ చరణి(Shree Charani) కూడా భాగమైంది. ఇదే ఆమెకు తొలి ప్రపంచ కప్. అరంగేట్రంలోనే అద్భుతం చేసింది. 9 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టి టాప్ 5 బౌలర్లలో నిలిచింది. ప్రత్యర్థికి పరుగులివ్వకుండా కట్టడి చేయడమే శ్రీ చరణి ప్రత్యేకత. ఫైనల్ మ్యాచ్‌లో ఒకానొక దశలో స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ కూడా చేతులెత్తేసింది. కానీ శ్రీ చరణి అంత ఒత్తిడిలోనూ డాట్స్ బాల్స్ వేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది.
మన తెలుగమ్మాయే..
కడప(Kadapa) జిల్లా యర్రంపల్లి గ్రామం శ్రీ చరణి స్వస్థలం. తొలుత ఆమె ఖోఖోలో జాతీయ స్థాయిలో రాణించింది. పదో తరగతి చదువుతున్నప్పుడే క్రికెట్‌పై ఉన్న మక్కువతో అనూహ్యంగా తన కెరీర్‌ను ఇటు వైపు మళ్లించింది. ముందుగా తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించినా.. తర్వాత అర్థం చేసుకుని ప్రోత్సహించారు. ముందుగా పొద్దుటూర్‌లో శిక్షణ తీసుకున్న శ్రీ చరణి.. ఆ తర్వాత హైదరాబాద్ కూకట్‌పల్లిలో రంజీ మాజీ క్రికెటర్ సురేష్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకుంది. మొదట్లో పేస్ బౌలర్ అయిన చరణి.. కోచ్ సురేష్ సూచనలతో ఆఫ్ స్పిన్నర్‌గా మారింది.
డబ్ల్యూపీఎల్ తర్వాత..
2023లో ముంబై వేదికగా జరిగిన టీ20 ఛాంపియన్‌షిప్ శ్రీ చరణి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ టోర్నీలో శ్రీ చరణి ఆటను గమనించిన ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం.. డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.55 లక్షలకు కొనుగోలు చేశారు. డబ్ల్యూపీఎల్(WPL) 2025 సీజన్ ఫైనల్లో ముంబైపై శ్రీ చరణి అదరగొట్టడంతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత జరిగిన ఛాలెంజర్ ట్రోఫీలో 9 వికెట్లు పడగొట్టడంతో తొలుత వన్డే, ఆ తర్వాత టీ20ల్లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసింది. గత జూన్‌లో ఇంగ్లండ్‌తో అరంగేట్ర టీ20 మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసింది. వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకొని టీమిండియా తుది జట్టులో తన స్థానాన్ని పదిలపర్చుకుంది. 1983 పురుషుల వరల్డ్ కప్ విజయానికి సమానంగా మన అమ్మాయిల రాత మార్చే అరుదైన ఘట్టంలో ఈ కడప బిడ్డ భాగమైంది. బహుషా ఈ విజయం కోసమే ఆమె ఖోఖోను వదిలి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుందేమో..!
ఈ వార్తలు కూడా చదవండి:
Shefali Verma Sachin Tendulkar: ఫైనల్‌కు ముందు సచిన్‌తో చాట్: షెఫాలీ వర్మ
Harmanpreet-Gavaskar: నాడు గావస్కర్.. నేడు హర్మన్!