IND vs ENG: 10 కిలోలు తగ్గినా పట్టించుకోలేదు.. ఇంత అన్యాయమా!
ABN , Publish Date - May 24 , 2025 | 07:55 PM
భారత జట్టులో చోటు దక్కుతుంది, ఇరదగీయాల్సిందేనని డిసైడ్ అయ్యాడు సర్ఫరాజ్ ఖాన్. ఈసారి అస్సలు వదలొద్దని అనుకున్నాడు. కానీ అంతా రివర్స్ అయింది. అతడి ఆశలు అడియాశలు అయ్యాయి.
విదేశీ గడ్డపై తొలి అవకాశం దక్కుతుందని అనుకున్నాడు. వరుసగా బిగ్ నాక్స్ ఆడి జట్టులో చోటును ఖాయం చేసుకోవాలని భావించాడు. భారత భవిష్యత్ తానే అని నిరూపించాలని పట్టుదలతో కనిపించాడు. అన్ని విధాలుగా ఆ సిరీస్‌కు సన్నద్ధమయ్యాడు. ఏకంగా 10 కిలోల బరువు కూడా తగ్గాడు. కట్ చేస్తే.. ఇంగ్లండ్ టూర్ కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. మనం మాట్లాడుకుంటోంది టాలెంటెడ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించే. ఈ సిరీస్ కోసం 18 మంది సభ్యుల బిగ్ స్క్వాడ్‌ను ప్రకటించింది బీసీసీఐ. ఇందులో సర్ఫరాజ్ పేరు లేదు. గత సిరీస్‌ల్లో టీమ్ వెంటే ఉన్న అతడ్ని ఎంపిక చేయకపోవడంతో యువ బ్యాటర్‌కు బోర్డు అన్యాయం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏకిపారేస్తున్నారు..
ఐపీఎల్-2025కు ముందు జరిగిన మెగా ఆక్షన్‌లో సర్ఫరాజ్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. దీంతో అతడు నిరాశ పడకుండా.. దొరికిన విరామాన్ని ఫిట్‌నెస్, బ్యాటింగ్ టెక్నిక్స్‌ను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగించుకున్నాడు. 5 నెలలుగా కఠినమైన శిక్షణతో పాటు ఆహార నియమాలు పాటించాడు. ఏకంగా 10 కిలోలు తగ్గి ఫుల్ ఫిట్‌గా మారాడు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై సర్ఫరాజ్ అదరగొట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ టూర్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడి పేరు రాలేదు. దీంతో బీసీసీఐపై విమర్శలు వస్తున్నాయి. ఇంత ప్రతిభావంతుడైన ఆటగాడ్ని పక్కనపెట్టడం ఏంటంటూ బోర్డును సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు నెటిజన్స్. ఇంత అంకితభావం ఉన్న ప్లేయర్లను పట్టించుకోకపోవడం దారుణమంటూ మండిపడుతున్నారు.
అదరగొడతాడా..
భారత టెస్ట్ జట్టులో చోటు కోసం గత కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. దేశవాళీల్లో పరుగుల వరద పారించాడు. ఎట్టకేలకు 2024 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటివరకు 6 టెస్టుల్లో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు బాదాడీ స్టైలిష్ బ్యాటర్. అయితే విదేశీ గడ్డ మీద అతడికి ఆడే చాన్స్ రాలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినా అతడ్ని తుదిజట్టులోకి తీసుకోలేదు. విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌తో జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉండటంతో వినియోగించుకోవాలని అనుకున్నాడు సర్ఫరాజ్. కానీ అతడ్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. అయితే భారత్-ఏ జట్టుకు ఎంపికైన ఈ యంగ్ బ్యాటర్.. ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటితే సీనియర్ టీమ్‌లోకి తీసుకునే చాన్సులు ఉన్నాయి.
ఇవీ చదవండి:
టీమిండియాలోకి ట్రక్ డ్రైవర్ కొడుకు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి