Share News

Mohammed Siraj: టచ్ చేయలేని రికార్డులు.. సిరాజ్ అంటే ఇది!

ABN , Publish Date - Jul 05 , 2025 | 10:57 AM

టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ టచ్ చేయలేని పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.

Mohammed Siraj: టచ్ చేయలేని రికార్డులు.. సిరాజ్ అంటే ఇది!
Mohammed Siraj

మహ్మద్ సిరాజ్.. టీమిండియా పేస్ యూనిట్‌లో కీలక బౌలర్. కొన్నేళ్లుగా భారత జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తూ వస్తున్నాడీ హైదరాబాదీ. మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌కు తురుపుముక్కగా మారిన సిరాజ్.. గెలుపు కోసం ఏం చేసేందుకైనా వెనుకాడడు. అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు ఎన్నో విజయాలు అందించినా సిరాజ్‌కు ఎందుకో తోపు పేసర్ అనే గుర్తింపు రావడం లేదు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి వంటి సీనియర్ల నీడలో ఎదుగుతూ వచ్చిన సిరాజ్.. ఇప్పుడు లెక్కలు మార్చే పనిలో పడ్డాడు. ఇంగ్లండ్ టూర్‌ను అందుకోసం వాడుకుంటున్నాడు. టచ్ చేయలేని రికార్డులను సృష్టిస్తూ తాను మామూలోడ్ని కాదని నిరూపిస్తున్నాడు.


సైంధవుడిలా అడ్డుపడి..

తిరుగులేని ఫిట్‌నెస్‌తో ఉన్న సిరాజ్.. దాన్ని ఇంగ్లండ్ పర్యటనలో వాడుకుంటున్నాడు. భారీ స్పెల్స్ వేస్తూ ప్రత్యర్థి జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అదే సమయంలో బుమ్రా లేకపోయినా పేస్ యూనిట్‌ను తాను నడపగలనని, వికెట్లు తీస్తూ టీమ్‌కు విజయాలు అందించగలనని నిరూపిస్తున్నాడు. అందుకు ఎడ్జ్‌బాస్టన్ టెస్టే ఉదాహరణ. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడుతున్న ఇంగ్లండ్‌ను సైంధవుడిలా అడ్డుకున్నాడు సిరాజ్. 6 వికెట్లతో ప్రత్యర్థి వెన్ను విరిచాడు. క్రాలే, రూట్, స్టోక్స్ లాంటి ప్రధాన బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించాడు. ఈ ప్రదర్శనతో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లో ఫైఫర్ (5 వికెట్లు) తీసిన అరుదైన బౌలర్‌గా బుమ్రా సరసన చోటు దక్కించుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో 6 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా కపిల్ దేవ్, ఇషాంత్ శర్మ సరసన చోటు దక్కించుకున్నాడు.

siraj.jpg


నంబర్ వన్ కాకపోయినా..

కేప్‌టౌన్‌లో 6 వికెట్లు, బర్మింగ్‌హామ్‌లో 6 వికెట్లు, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో 5 వికెట్లు, బ్రిస్బేన్‌లో 5 వికెట్లు, లార్డ్స్‌లో 4 వికెట్లు, బర్మింగ్‌హామ్‌లో 4 వికెట్లు, లార్డ్స్‌లో 4 వికెట్లు, అడిలైడ్‌లో 4 వికెట్లు.. గత కొన్నేళ్లలో ఓవర్సీస్ టెస్ట్‌ల్లో సిరాజ్ ప్రదర్శన ఇది. దీన్ని బట్టే స్వదేశంలోనే కాదు, విదేశీ సిరీస్‌ల్లోనూ ఈ హైదరాబాదీ టీమిండియాకు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇది చూసిన నెటిజన్స్.. బుమ్రా మాదిరిగా సిరాజ్ నంబర్ వన్ బౌలర్ కాకపోవచ్చు, కానీ ఆ స్థాయిలో ప్రత్యర్థులను వణికిస్తుంటాడని, ఆ రేంజ్‌కు చేరుకునేందుకు ఎంత కష్టమైనా పడేందుకు రెడీ అని.. అదే అతడి ప్రత్యేకత అని అంటున్నారు.


ఇవీ చదవండి:

టీమిండియాతో పెట్టుకుంటే ఇట్లుంటది!

ఓటమి ఒప్పుకోవడానికి ఇంత భయమా..

బంగ్లాదేశ్‌లో భారత పర్యటన లేనట్టే

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 10:57 AM