Jitesh Sharma: ఆ ఒక్క మాటే మమ్మల్ని గెలిపించింది.. జితేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - May 28 , 2025 | 02:43 PM
ఒక్క మాటతో అంతా మారిపోయిందని అంటున్నాడు ఆర్సీబీ తాత్కాలిక సారథి జితేష్ శర్మ. అతడు చెప్పిన మాటలతో తాను రెచ్చిపోయి ఆడానని చెబుతున్నాడు. మ్యాచ్ మారిపోవడానికి అదే కారణమని బయటపెట్టాడు.
ఆశ్చర్యం, అద్భుతం, సంచలనం.. ఇలా ఎన్ని మాటలు వాడినా తక్కువే. అంత బాగా ఆడాడు ఆర్సీబీ తాత్కాలిక సారథి జితేష్ శర్మ. లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం నాడు జరిగిన ఆఖరి లీగ్ పోరులో 33 బంతుల్లో 85 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్‌తో అతడు చెలరేగాడు. 8 బౌండరీలు, 6 సిక్సులతో లక్నో బౌలర్లకు పీడకల ఎలా ఉంటుందో చూపించాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30), విరాట్ కోహ్లీ (30 బంతుల్లో 54), మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్) కూడా అదరగొట్టడంతో ప్రత్యర్థి సంధించిన 227 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఉఫ్‌మని ఊదిపారేసింది బెంగళూరు. ఈ గెలుపుతో క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో సంచలన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని శాసించిన జితేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
ఒక్క మాటతో..
మెంటార్ దినేశ్ కార్తీక్ చెప్పిన ఒక్క మాటతో అంతా మారిపోయిందన్నాడు జితేష్. అతడి మాటలు తనలో స్ఫూర్తి నింపాయని.. గెలవాల్సిందేననే కసితో బ్యాటింగ్ చేయించాయని తెలిపాడు. ‘నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. నేనేనా ఇలా ఆడిందనే అనుమానం కలుగుతోంది. దీన్ని నమ్మలేకపోతున్నా. కోహ్లీ ఔట్ అయిన అనంతరం బ్యాటింగ్‌కు వెళ్లా. ఆ సమయంలో మా జట్టు మెంటార్ దినేశ్ కార్తీక్ ఓ మాట అన్నాడు. బాగా ఆడి.. టీమ్‌ను గెలిపించు. నీదే బాధ్యత అని చెప్పాడు. ఆ మాటలతో ఇన్‌స్పైర్ అయ్యా. తదుపరి మ్యాచుల్లోనూ ఇదే ఆటతీరును కొనసాగించాలని అనుకుంటున్నా’ అని జితేష్ చెప్పుకొచ్చాడు. కాగా, క్వాలిఫయర్-1కు అర్హత సాధించిన ఆర్సీబీ.. ఆ పోరులో పంజాబ్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అందులో గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే క్వాలిఫయర్-2లో ఆడాల్సి ఉంటుంది. అప్పుడు ముంబై ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్‌లో ఒక జట్టుతో బెంగళూరు తాడోపేడో తేల్చుకోవాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి