India vs Pakistan Live: నేటి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ ఎక్కడొస్తుంది.. ఎలా చూడాలంటే..
ABN , Publish Date - Sep 14 , 2025 | 10:47 AM
ఆసియా కప్ 2025లో నేటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రేజీ క్లాష్ ఎక్కడ లైవ్‌లో చూడాలి, ఎప్పుడు మొదలవుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసియా కప్ 2025(Asia Cup 2025)లో భారత్-పాకిస్తాన్ (India vs Pakistan live) మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గ్రూప్ ఏలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ సంవత్సరం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో మైదానంలో ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కడ చూడాలి?
భారత్‌లో ఈ మ్యాచ్‌ను సోనీ లివ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. అలాగే, సోనీ స్పోర్ట్స్ టెన్ 1, సోనీ స్పోర్ట్స్ టెన్ 1 హెచ్‌డీ, సోనీ స్పోర్ట్స్ టెన్ 5, సోనీ స్పోర్ట్స్ టెన్ 5 హెచ్‌డీ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అందుబాటులో ఉంటుంది. ప్రాంతీయ భాషలలో చూడాలనుకునే వారికి సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 3 హెచ్‌డీ (హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం & తెలుగు) ఛానెళ్లలో ప్రసారం అవుతుంది. మ్యాచ్ సాయంత్రం 8:00 గంటలకు (IST) ప్రారంభమవుతుంది.
భారత్ ఫేవరెట్‌గా ఎంట్రీ
ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా మంచి ఫామ్‌తో బరిలోకి దిగుతున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో యూఏఈని 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ హాంకాంగ్‌పై 93 పరుగులతో విజయం సాధించింది. ఈ విజయాలతో రెండు జట్లూ సూపర్ ఫోర్‌కు అర్హత సాధించేందుకు పోటీపడుతున్నాయి.
ఎనిమిది సార్లు..
ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 టీ20 జట్టుగా ఉన్న భారత్, ఆసియా కప్‌లో ఎనిమిది సార్లు టైటిల్ గెలిచిన రికార్డుతో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ వంటి యువ ఆటగాళ్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ భారత్‌కు బలంగా ఉంది.
పాకిస్తాన్ కూడా..
మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ రెండు సార్లు ఆసియా కప్ గెలిచిన చరిత్ర కలిగి ఉంది. సల్మాన్ ఆగా కెప్టెన్‌గా, ఫఖర్ జమాన్, హరీస్ రఊఫ్, షాహీన్ షా ఆఫ్రిదీ వంటి ఆటగాళ్లతో జట్టు బలంగా కనిపిస్తోంది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లేనప్పటికీ, పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలమైన ఆటగాళ్లను కలిగి ఉంది.
హెడ్-టు-హెడ్ రికార్డ్
భారత్-పాకిస్తాన్ టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 9-3తో ఆధిపత్యం చెలాయిస్తోంది. 2022 ఆసియా కప్‌లో దుబాయ్‌లో పాకిస్తాన్ భారత్‌పై చివరి విజయం సాధించింది. 2024 టీ20 వరల్డ్ కప్‌లో న్యూయార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ఆసియా కప్‌లో ఇప్పటివరకు రెండు జట్లు 19 సార్లు తలపడగా, భారత్ 10, పాకిస్తాన్ 6 మ్యాచ్‌లు గెలిచాయి. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి