Share News

Sports: విజయాల వేదిక.. భారత్‌కు కలిసివచ్చిన ఏసీఏ-వీడీసీఏ స్టేడియం

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:05 PM

విశాఖపట్టణంలోగల ఏసీఏ వీడీసీఏ స్టేడియం... భారత్‏కు విజయాల వేదికగా మారుతోంది. ఈ స్టేడియంలో మ్యాచ్ జరిగితే.. ఇక విజయం భారత్‏దేనని క్రికెట్ అభిమానులు అంటుంటారు. మొత్తం పది అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు జరిగితే అందులో ఏడు భారత్ గెలవడం విశేషం.

Sports: విజయాల వేదిక.. భారత్‌కు కలిసివచ్చిన ఏసీఏ-వీడీసీఏ స్టేడియం

- ఇప్పటివరకు పది వన్డేల్లో ఏడింట గెలుపు

- తాజాగా 11వ వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం

- 6న భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య వన్డే

- అత్యధిక పరుగులు, సెంచరీల బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ

- అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రోహిత్‌ శర్మ

- అత్యధిక జట్టు స్కోరు, విజయాల శాతం భారత్‌దే

- అత్యల్ప స్కోరు చేసిన న్యూజిలాండ్‌

విశాఖపట్నం: పీఎంపాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం భారత్‌కు విజయాల వేదికగా నిలిచింది. ఇక్కడ ఇప్పటివరకు పది అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వగా ఏడు మ్యాచ్‌లలో భారత్‌ విజయశిఖరాలను అందుకోగా, ఒకటి టైగా ముగిసింది. కేవలం రెండు మ్యాచ్‌లలోనే పరాజయం చవిచూసింది. తాజాగా ఈనెల 6న భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య 11వ వన్డే మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ స్టేడియం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏప్రిల్‌ 5, 2005లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య తొలి వన్డే జరిగింది. చివరిగా మార్చి 19, 2023న భారత్‌-ఆస్ర్టేలియా మధ్య మ్యాచ్‌ నిర్వహించారు. సుమారు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో క్రీడాభిమానుల్లో ఆసక్తి పెరిగింది. విరాట్‌, రోహిత్‌ వంటి అభిమాన క్రికెటర్లు మరోసారి విశాఖలో ఆడనుండడంతో మరింత ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.


కోహ్లీ రికార్డు...

zzzzzzz.jpg

విశాఖలో ఇప్పటివరకు జరిగిన పది వన్డేల్లో ఏసీఏ వీడీసీఏ స్టేడియం పిచ్‌పై అత్యధిక పరుగులు, వ్యక్తిగత స్కోరు, సెంచరీలు సాధించిన రికార్డు విరాట్‌ కోహ్లీ పేరిట ఉంది. 2010 నుంచి 2023 వరకు ఇక్కడ ఏడు వన్డేలు ఆడిన విరాట్‌, ఏడు ఇన్నింగ్స్‌లలో 587 పరుగులు సాధించాడు. వీటిలో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలున్నాయి. అలాగే వ్యక్తిగత అత్యధిక స్కోరులో కూడా ప్రతిభ చూపాడు. అక్టోబరు 24, 2018లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీ (157 నాటౌట్‌) వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదుచేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.


రోహిత్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు..

xxxxx.jpg

ఈ పిచ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డు రోహిత్‌ శర్మ పేరిట ఉంది. డిసెంబరు 18, 2019న వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో చేసిన భారీ సెంచరీ (159) రికార్డుగా నిలిచింది. కాగా 2011 నుంచి 2023 వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ...ఏడు ఇన్నింగ్స్‌లలో 355 పరుగులు సాధించి కోహ్లీ తర్వాత రెండోస్థానంలో నిలిచాడు. ఇక వ్యక్తిగత అత్యధిక స్కోరు చేసిన వారిలో మహేందర్‌ సింగ్‌ ధోనీ (148) మూడో స్థానంలో ఉన్నాడు. ఏప్రిల్‌ 5, 2005లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ ఘనత సాధించాడు.


అత్యధిక స్కోరు భారత్‌దే..

ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన పది వన్డేలలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు భారత్‌ కావడం విశేషం. డిసెంబరు 18, 2019న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 387 పరుగులు చేసి రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ భారీ సెంచరీ (159), కేఎల్‌ రాహుల్‌ సెంచరీ (102), శ్రియాస్‌ అయ్యర్‌ అర్ధ సెంచరీ (53) చేశారు. అలాగే ఏప్రిల్‌ 5, 2005న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 356 పరుగులు చేసి క్రీడాభిమానులకు క్రికెట్‌ విందునందించింది. ఈ మ్యాచ్‌లో ధోనీ భారీ సెంచరీ (148), వీరేంద్ర సెహ్వాగ్‌ (74), రాహుల్‌ ద్రావిడ్‌ (52) హాఫ్‌ సెంచరీలు చేశారు.


న్యూజిలాండ్‌ పేరిట అత్యల్ప స్కోరు

భారత్‌తో అక్టోబరు 29, 2016న జరిగిన వన్డేలో న్యూజిలాండ్‌ 23.1 ఓవర్లలో కేవలం 79 పరుగులకు కుప్పకూలి ఈ స్టేడియంలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 269 పరుగులు చేయగా....న్యూజిలాండ్‌ 79 పరుగులకు ఆలౌటై 190 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. భారత్‌ బౌలర్‌ అమిత్‌ మిశార ఐదు వికెట్లు పడగొట్టాడు.


ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన వన్డేలు... ఫలితాలు

తేది - తలపడిన జట్లు - గెలిచిన జట్టు

ఏప్రిల్‌ 5, 2005 భారత్‌-పాకిస్థాన్‌ భారత్‌

ఫిబ్రవరి 17, 2007 భారత్‌-శ్రీలంక భారత్‌

అక్టోబరు 20, 2010 భారత్‌-ఆస్ర్టేలియా భారత్‌

డిసెంబరు 2, 2011 భారత్‌-వెస్ట్టిండీస్‌ భారత్‌

నవంబరు 24, 2013 భారత్‌-వెస్ట్టిండీస్‌ వెస్ట్టిండీస్‌

అక్టోబరు 29, 201 భారత్‌-న్యూజిలాండ్‌ భారత్‌

డిసెంబరు 17, 2017 భారత్‌-శ్రీలంక భారత్‌

అక్టోబరు 24, 2018 భారత్‌-వెస్ట్టిండీస్‌ టై

డిసెంబరు 18, 2019 భారత్‌-వెస్ట్టిండీస్‌ భారత్‌

మార్చి 19, 2023 భారత్‌-ఆస్ర్టేలియా ఆస్ర్టేలియా


ఈ వార్తలు కూడా చదవండి..

వాడూ.. వీడూ.. ఎవడు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 05 , 2025 | 01:05 PM