Abhishek Sharma: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లో అభిషేక్ , రౌఫ్ వాగ్వాదం వైరల్ వీడియో
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:49 AM
భారత్, పాకిస్తాన్ మధ్య నిన్న జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఓ వాగ్వాదం చోటుచేసుకుంది. భారత ఓపెనర్లను కవ్వించే ప్రయత్నం చేయగా, అది కాస్తా పాకిస్తాన్ జట్టుకు రివర్స్ అయ్యింది. చివరకు చిత్తు చిత్తుగా ఓడింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ మరోసారి పాకిస్తాన్‌పై ఘన విజయం నమోదు చేసింది. ఈ క్రమంలోనే భారత ఓపెనర్ అభిషేక్ శర్మ, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్‌తో (Abhishek Sharma vs Haris Rauf) జరిగిన వాగ్వాదంపై మౌనం వీడాడు. అలాగే, ఈ మ్యాచ్‌లో భారత T20I వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కి కూడా సపోర్ట్ చేశాడు. ఈ ఉద్వేగభరిత మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం.
కవ్వించే ప్రయత్నం
భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. షహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు కొట్టిన శుభమన్ గిల్, అతని స్లెడ్జింగ్‌కు స్పందిస్తూ వెళ్లి బంతి తెచ్చుకో అంటూ వ్యంగ్యంగా చెప్పాడు. తర్వాత రౌఫ్ బౌలింగ్‌కు వచ్చినప్పుడు, తన బంతులతో భారత ఓపెనర్లను కవ్వించే ప్రయత్నం చేశాడు. ఓ దశలో అభిషేక్ శర్మ..హారిస్ రౌఫ్ ఒకరికొకరు వాగ్వాదం తీవ్రమవుతున్న సమయంలో అంపైర్లు వచ్చి పరిస్థితి నియంత్రణలోకి తెచ్చారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారత ఆటగాళ్లు సంయమనం కోల్పోకుండా లక్ష్యాన్ని ఈజీగా పూర్తి చేశారు.
అభిషేక్ శర్మ సంచలన ఇన్నింగ్స్
అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 39 బంతుల్లో 74 పరుగులు చేసి, ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. అతని విధ్వంసక ఇన్నింగ్స్ భారత్‌కు లక్ష్యాన్ని సులభంగా చేధించేందుకు దోహదపడింది. అభిషేక్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా ఓపెనింగ్‌లో అద్భుతంగా ఆడాడు. వీరిద్దరి భాగస్వామ్యం భారత్‌కు శుభారంభాన్ని అందించింది. ఈ ప్రదర్శనతో అభిషేక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
అభిషేక్ శర్మ స్పందన
పాకిస్తాన్ ఆటగాళ్ల వైఖరి తనను మరింత పట్టుదలతో ఆడేలా ప్రేరేపించిందని మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ తెలిపాడు. పాక్ ఆటగాళ్లు అనవసరంగా మాతో వాగ్వాదం చేశారని, అది తనకు అస్సలు నచ్చలేదన్నాడు. అందుకే మా జట్టును గెలిపించాలని మరింత కసితో ఆడినట్లు చెప్పాడు. తాను, శుభ్‌మన్ గిల్ స్కూల్ రోజుల నుంచి కలిసి ఆడుతున్నాం. మేము ఒకరికొకరు అనుబంధంతో బ్యాటింగ్ చేస్తాం. ఈ రోజు మా రోజు. గిల్ కూడా పాకిస్తాన్ ఆటగాళ్ల మాటలకు తన బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడని, అది చాలా నచ్చిందని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి