Share News

Lionel Messi: 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:32 AM

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం కోల్‌కతాకి చేరుకున్నారు. అక్కడ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో కలిసి 70 అడుగులు తన విగ్రహాన్ని మెస్సి వర్చువల్‌గా ఆవిష్కరించాడు.

 Lionel Messi: 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ ప్రారంభమైంది. శనివారం మెస్సి కోల్‌కతాకు చేరుకున్నాడు. ఆయనతో పాటు అతడి ఇంటర్ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సూవారెజ్ ఇండియాకు వచ్చారు. మెస్సిని చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తాజాగా కోల్‌కతాలో 70 అడుగుల మెస్సి(Lionel Messi) విగ్రహావిష్కరణ జరిగింది.


ఉదయం లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌తో కలిసి మెస్సి వర్చవల్‌గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా అతడు అక్కడికి వెళ్లలేకపోయాడు. తర్వాత సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలను కలుస్తాడు. శనివారం కోల్‌కతాలో కార్యక్రమం ముగియగానే మెస్సి హైదరాబాద్‌ బయలుదేరతాడు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడు. ఆ తర్వాత గోట్‌ కప్‌ పేరుతో ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఆడతాడు. ఉప్పల్‌ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఆడతారు.


విగ్రహంపై మెస్సి సంతోషం..

తన 70 అడుగుల భారీ విగ్రహంపై మెస్సీ ఎంతో సంతోషం వ్యక్తం చేసినట్లు పశ్చిమ బెంగాల్ మంత్రి, శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు సుజిత్ బోస్ తెలిపారు. ఈ 70 అడుగుల విగ్రహం ఫుట్‌బాల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని చేతబట్టుకున్న మెస్సీ రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. 2022 ప్రపంచకప్ విజయానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది.


‘మేం మెస్సి మేనేజర్‌తో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఈ విగ్రహ నిర్మాణానికి మెస్సి యాజమాన్యం ముందు అనుమతి ఇచ్చింది. ఈ విగ్రహంపై మెస్సి ఎంతో సంతృప్తిగా ఉన్నాడు. ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. 70 అడుగుల ఎత్తుతో ఇంత భారీ మెస్సీ విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ నిర్మాణాన్ని కేవలం 40 రోజుల్లో పూర్తి చేశాం. కోల్‌కతాకు మెస్సీ వస్తుండటంతో అభిమానుల్లో అపూర్వమైన ఉత్సాహం నెలకొంది’ మంత్రి సుజిత్ బోస్ అన్నారు.


ఇవీ చదవండి:

జట్టుకి ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇర్ఫాన్ పఠాన్

గావస్కర్ వ్యక్తిత్వ హక్కులపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Updated Date - Dec 13 , 2025 | 12:43 PM