Rohit Sharma: రో‘హిట్’ డబుల్ ‘ట్రిపుల్’ ధమాకా..!
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:11 AM
టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. తన కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. అందులో అత్యంత ముఖ్యమైనది.. మూడు సార్లు డబుల్ సెంచరీ చేయడం! అందులో ఒకటి 2017 డిసెంబర్ 13న శ్రీలంకపై 208* పరుగులు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: లావుగా ఉన్నాడు.. ఫిట్‌నెస్ లేదు? క్రికెట్‌కు పనికొస్తాడా? అనే సూటిపోటి మాటలు! మిడిలార్డర్‌లో రాణించడం లేదు.. అతడిని పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందన్న వాదనలు! తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు.. ఒడుదొడుకులు! కానీ అతనెప్పుడూ ఆగిపోలేదు. విమర్శలకు కుంగిపోలేదు! ఆనందంగా ఆటను ఆస్వాదించడమే అతనికి తెలుసు. ఓపెనర్‌గా మారినప్పటి నుంచి పరుగుల వేటలో సాగడమే అతని అలవాటు. వేలెత్తి చూపిన వాళ్లకు ఆటతో.. నోరెత్తి మాట్లాడిన వాళ్లకు పరుగులతో సమాధానమిచ్చాడు. ప్రపంచ క్రికెట్లో చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమైన మైలురాయి చేరుకున్నాడు. వన్డేల్లో అలవోకగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారత ఆటగాడిగా నిలిచాడు. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు(డిసెంబర్ 13) శ్రీలంకపై డబుల్ సెంచరీ(208*) సాధించి చరిత్ర సృష్టించాడు.
బాదుడే బాదుడు..
వన్డేల్లో రోహిత్(Rohit Sharma) బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వన్డేల్లో అతని ముద్ర ఎప్పుడో పడింది. అతని అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలకు వన్డేలు ఎప్పుడూ వేదికగా నిలుస్తున్నాయి. లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా కెరీర్ మొదలెట్టి.. కెప్టెన్‌గా, ఇప్పుడు ఓపెనర్‌గా పరుగుల వేటలో సాగుతున్నాడు. దానికి తాజా నిదర్శనం ఆసీస్, సౌతాఫ్రికా సిరీస్‌లే!
వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడమే చాలా కష్టం అనుకుంటే.. రోహిత్ శర్మ అలవోకగా.. మూడు సార్లు చేసి చూపించాడు. అందులో ఒకటైతే ఏకంగా 264 పరుగులు! రోహిత్ శర్మ మొదట 2013 నవంబర్ 2న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాపై 209 (158 బంతుల్లో, 12 ఫోర్లు, 16 సిక్స్‌లు) చేశాడు. తర్వాత దాదాపు మరో ఏడాదికే శ్రీలంకపై 264 పరుగులు చేశాడు. ఈ రెండు డబుల్ సెంచరీలతో ఆగని రోహిత్.. 2017 డిసెంబర్ 13న మొహాలీ వేదికగా శ్రీలంకపై 208* (153 బంతుల్లో, 13 ఫోర్లు, 12 సిక్స్‌లు) పరుగులతో మరోసారి చెలరేగిపోయాడు. ఇలా మొత్తంగా మూడు డబుల్ సెంచరీలు, అందులో రెండు శ్రీలంక పైనే చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గానూ నిలిచాడు.
రికార్డులే రికార్డులు..
వన్డేల్లో అత్యధిక సార్లు(3) డబుల్ సెంచరీలు చేసిన రికార్డ్‌తో పాటు, అత్యధిక పరుగులు(264) చేసిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరు మీదే ఉంది. ప్రస్తుతం హిట్‌మ్యాన్ తన కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో మూడో వన్డేలో సూపర్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఫిట్‌నెస్ పరంగానూ స్లిమ్‌గా మారి మెరుగయ్యాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అన్నీ కలిసి వస్తే.. వన్డేలకు కూడా వీడ్కోలు పలికే లోపు.. రోహిత్ నాలుగో డబుల్ సెంచరీ బాదేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు!
ఇవీ చదవండి:
జట్టుకి ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇర్ఫాన్ పఠాన్
గావస్కర్ వ్యక్తిత్వ హక్కులపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు