Share News

Aakash Chopra: కెప్టెన్ పని టాస్ వేయడమేనా?.. సూర్య ఫామ్‌పై మాజీ క్రికెటర్ అసహనం

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:00 AM

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా అసహనం వ్యక్తం చేశాడు. కెప్టెన్ అంటే టాస్ మాత్రమే వేయడం కాదు.. పరుగులు కూడా చేయాలని తెలిపాడు.

Aakash Chopra: కెప్టెన్ పని టాస్ వేయడమేనా?.. సూర్య ఫామ్‌పై మాజీ క్రికెటర్ అసహనం
Aakash Chopra

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 20 టీ20 ఇన్నింగ్స్‌‌ల్లో సూర్య ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. 20 ఇన్నింగ్స్‌ల్లో ఇప్పటివరకు అతడు చేసింది కేవలం 227 పరుగులే. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల హోం సిరీస్‌లోనూ సూర్య ఫామ్ మెరుగుపడలేదు. తొలి మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన అతడు, రెండో మ్యాచ్‌లో కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. తాజా వైఫల్యం తర్వాత మాజీ భారత ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా(Aakash Chopra) కీలక వ్యాఖ్యలు చేశాడు.


‘కెప్టెన్ పని టాస్ వేయడమేనా? బౌలర్లను నిర్వహించడమేనా? కెప్టెన్‌గా చేసే పనుల్లో ఇవి ఓ భాగం మాత్రమే. అసలు పని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం. అత్యధిక పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించడం. ఇప్పటి వరకు ఆడిన 20 టీ20 ఇన్నింగ్స్‌ల్లో యావరేజ్ 14 మాత్రమే ఉండటం ఆందోళనకరం. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తేనే సరిపోదు.. ఫామ్ అందుకోవాలి’ అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.


వ్యతిరేకం కాదు..

‘నేను సూర్యకుమార్ కెప్టెన్సీకి వ్యతిరేకం కాదు. అతడు ప్రపంచ కప్‌కు కెప్టెన్‌గా ఉండడంపై కూడా ఎలాంటి సందేహం వ్యక్తం చేయడం లేదు. కానీ నేను కచ్చితంగా చెప్పే విషయం మాత్రం ఒక్కటే.. అతడు పరుగులు చేయాల్సిందే. 2026 ఫిబ్రవరి–మార్చిలో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫామ్‌లో ఉండటం అత్యంత కీలకం. నంబర్ 3 లేదా 4లో బ్యాటింగ్ చేసి దీర్ఘకాలంగా పరుగులు చేయలేకపోతే, ప్రపంచకప్‌కు వెళ్లే సమయానికి ఆటగాళ్లపై నమ్మకం ఉండదు. అందుకే కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ పరుగులు చేయడం అత్యవసరం’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.


ఇవీ చదవండి:

జట్టుకి ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇర్ఫాన్ పఠాన్

గావస్కర్ వ్యక్తిత్వ హక్కులపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Updated Date - Dec 13 , 2025 | 10:00 AM