Viral Video : బెంగళూరులో 4 అడుగులు లేని ఫ్లాట్.. రెంట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది..
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:06 PM
Bengaluru Room Rent Viral Video : బెంగళూరులో కచ్చితంగా నాలుగు అడుగులు కూడా లేని ఓ ఫ్లాట్ ధర ఎంతో వింటే ఎవరికైనా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంట్రా బాబోయ్.. ఈ మాత్రం దానికి మరీ ఇంత ఎక్కువనా అని షాక్ అవటం ఖాయం. బెంగళూరులో గది అద్దె ఖర్చులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్తూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అదిప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.
Bengaluru Room Rent Viral Video : బెంగళూరులో అద్దె ఖర్చులు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మెట్రోపాలిటన్ సిటీలో ఇళ్లు దొరకటమే కష్టం. ఒకవేళ దొరికినా వచ్చిన జీతంలో సగానికిపైగా రెంట్ కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా అని నచ్చిన ఇల్లు దొరకుతుందా అంటే అదీ లేదు. ఉండటానికి ఏదొకటి దొరికిందని సరిపెట్టుకోవాలే తప్ప.. నచ్చినట్టుగా ఉండే ఇల్లు కోసం గాలించినా వేస్ట్. అద్దెకు ఉండాలన్నా, మంచి స్థలం కొనుగోలు చేయాలన్నా వెతికి వెతికి తలనొప్పి రాక మానదు. ఇల్లు ఇరుకైనా.. అద్దె మాత్రం పెద్ద మొత్తమని.. తాను పడుతున్న కష్టాన్ని నెటిజన్లకు ఫన్నీగా వివరిస్తూ ఇటీవల ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ వీడియో షేర్ చేయగా అదిప్పుడు వైరల్‌గా మారింది.
జాగా కొంచెం.. అద్దె ఘనం..
బెంగళూరులో రూం రెంట్ ఖర్చు ఎంత భారీగా ఉంటాయో వివరిస్తూ ఇటీవల ఓ ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో తన ఫ్రెండ్ నివసిస్తున్న చిన్నపాటి సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను నెటిజన్లకు ఫన్నీగా పరిచయం చేశాడు. ఇరుకైన గది మధ్యలో నిలబడి రెండు చేతులు చాచగానే గదికి అటూ ఇటూ ఉన్న రెండు గోడలు చేతికి తాకాయి. ఆ వెంటనే తన పాదాన్ని ఒక గోడను తాకించి ఎదురుగా ఉన్న గోడను చేతితో తాకుతూ గది పొడవు ఎంత చిన్నదో చూపిస్తాడు. బాల్కనీ అయితే మరీ చిన్నది. ఒక వ్యక్తి నిలబడితే ఇక పక్కకు తిరగడమూ కష్టమే. చిన్న గది కావడం వల్ల మీరు వస్తువులను కొనుక్కోవాల్సిన పనిలేదు. కాబట్టి డబ్బు కూడా ఆదా అవుతుంది. చివరగా ఇంత చిన్నగది అద్దె నెలకు రూ. 25,000 అని చెప్తూనే.. ఇక గర్ల్ ఫ్రెండ్ ఖర్చు పెట్టేందుకు ఏం మిగలదంటూ ఫన్నీగా నవ్వేస్తాడు.
ఈ వీడియో వైరల్ అయ్యాక బెంగళూరులో అద్దె ధరలు ఎక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. చాలామంది ఇంత చిన్న, ఇరుకైన గదులకు ఇంటి యజమానులు అంత ఎక్కువ అద్దె వసూలు చేయడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. కొందరు అపార్ట్‌మెంట్ సైజ్ చూపిస్తూ "మినిమలిస్ట్ లైఫ్ స్టైల్" అని ఒకరు రాస్తే, "భాయ్ నా బాత్రూమ్ ఈ గది కంటే పెద్దది" అని ఒకరంటే, "ఈ గది బాల్కనీలాంటిది" అని, "నిజంగా ఇది నిజమైన బ్రహ్మచారికి స్వర్గం" అని సెటైర్లు వేస్తున్నారు.