E10 Shinkasen Bullet Train: భారత్‌లో పరుగులు పెట్టనున్న జపాన్ బుల్లెట్ ట్రెయిన్.. అదిరిపోయే ఫీచర్స్
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:25 PM
ప్రస్తుతం ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో బుల్లెట్ ప్రాజెక్టు అంశం కూడా చర్చకు రానుంది. మరి ఈ బుల్లెట్ రైలు ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఎంతోకాలంగా భారతీయులను ఊరిస్తున్న బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు సాకారమయ్యే సమయం దగ్గరపడింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ అంశంపై కీలక చర్చలు చేపట్టే అవకాశం ఉంది. ఈ అత్యాధునిక రైళ్లు (E10 Shinkasen Bullet Trains) నడిపేందుకు జపాన్‌లో శిక్షణ పొందుతున్న భారతీయ డ్రైవర్‌లను ఈ పర్యటన సందర్భంగా మోదీ కలవనున్నారు.
ఏమిటీ బుల్లెట్ రైలు ప్రాజెక్టు
అత్యాధునికమైన బుల్లెట్ రైలు భారత్‌లో ప్రవేశపెట్టాలన్న సంకల్పంతో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడు రెయిల్ ప్రాజెక్టు (MAHSR Project) 2017లో ప్రారంభమైంది. ముంబై, అహ్మదాబాద్ మధ్య చక్కర్లు కొట్టే ఈ రైలు ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే గుజరాత్‌లోని సబర్మతిలో శంకుస్థాపన కూడా చేశారు. అంతకుముందు నాలుగేళ్ల పాటు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం తరువాత భారతీయ రైల్వే, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 80 శాతం నిధులను లోన్ రూపంలో సమకూర్చేందుకు జపాన్ అంగీకరించింది. ఆ తరువాత వివిధ కారణాల రీత్యా ప్రాజెక్టు అమలు వాయిదా పడుతూ వచ్చినా మళ్లీ జోరందుకుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి సెక్షన్ 2027లో అందుబాటులోకి రానుంది. మరుసటి ఏడాది పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా ప్లాన్ చేశారు. ముంబై నుంచి 508 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు ఈ రైల్లో కేవలం రెండు గంటల ఏడు నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. అంటే.. మెరుపు వేగానికి ఈ జర్నీ అచ్చమైన ఉదాహరణగా నిలవనుంది.
బుల్లెట్ రైలు ఫీచర్స్ ఇవీ..
ఈ ప్రాజెక్టు కింద తొలుత ఈ5 షింకాసెన్ సిరీస్ రైళ్లను భారత్‌కు అందించేందుకు జపాన్ సిద్ధమైంది. ఆ తరువాత ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగింది. ఈలోపు ఈ10 సిరీస్ పేరిట కొత్త తరం మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి.
ఈ5 షింకాసెన్ రైళ్ల కంటే మెరుగ్గా భూకంపాలను తట్టుకునేలా ఈ10 సిరీస్ రైళ్లను డిజైన్ చేశారు. ఆంగ్ల అక్షరం ఎల్ ఆకారంలో ఉన్న ట్రాక్స్‌పై ఈ రైళ్లు పరుగులు తీస్తాయి. ఫలితంగా భూకంపాల సమయంలో రైలు పట్టాలు తప్పదు. ప్రయాణం సందర్భంగా కుదుపులు తగ్గించేందుకు ఈ10 రైళ్లలో ప్రత్యేక డాంపెనర్స్‌ను ఏర్పాటు చేశారు.
ఈ రైళ్లు అత్యధికంగా గంటలకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉన్నా గరిష్ఠ వేగాన్ని గంటకు 320 కిలోమీటర్లకే ఎలక్ట్రానిక్ విధానంలో పరిమితం చేశారు.
ఈ5తో పోలిస్తే ఈ10 సిరీస్‌లోని బ్రేకులు మరింత సమర్థమంతమైనవి. బ్రేకులు వేసిన నాలుగు కిలోమీటర్లకు ఈ5 రైలు పూర్తిస్థాయిలో నిలిచిపోతే ఈ10 రైళ్లు మాత్రం 3.4 కిలోమీటర్లకు ఆగిపోతాయి.
ప్యాసెంజర్‌లకు మరింత సౌకర్యంగా ఉండేందుకు వీటిని డిజైన్ చేశారు. వీల్ చైర్‌లోని వారికి అనుకూలంగా విండో సీట్‌లను ఏర్పాటు చేశారు. అదనపు లగేజీ లేదా ప్యాసెంజర్‌లను తరలించేందుకు సీట్ల అమరిక మార్చుకునేలా డిజైన్ చేశారు. ఇక బిజినెస్ క్లాస్ ప్యాసెంజర్‌కు ప్రత్యేక రిక్లైనర్ సీట్లు, వైఫై, సీట్ల ముందు డెస్క్‌లు ఉంటాయి. ప్రకృతి రమణీయతను గుర్తుకు తెచ్చేలా ప్రత్యేకమైన ఆకుపచ్చ రంగుల్లో రైలు లోపలిని భాగాలను తీర్చి దిద్దారు.
2027లో తొలుత ఈ5 రైళ్లు భారత్‌లో పరుగులు పెట్టనున్నాయి. ఆ తరువాత ఈ10 రైళ్లు భారత్‌కు అందుబాటులోకి వస్తాయి. జపాన్‌లో ప్రస్తుతమున్న ఈ5, ఈ2 షింకాసెన్ బుల్లెట్ రైళ్ల స్థానంలో 2030 కల్లా ఈ10 రైళ్లను ప్రవేశపెట్టేందుకు జపాన్ నిర్ణయించింది.
జపాన్‌తో పాటు ఫ్రాన్స్, చైనా, జర్మనీలో కూడా ఇలాంటి రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్టుకు తొలుత ఫ్రాన్స్‌తో భాగస్వామ్యానికి ప్లాన్ చేసిన భారత్ ఆ తరువాత జపాన్ వైపు మొగ్గు చూపింది. ఇక తాజా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈ10 షింకాసెన్ రైళ్ల తయారీ యూనిట్‌ను కూడా సందర్శించనున్నారు.
ఇవీ చదవండి:
అమెరికాలో చదివి ఇండియాకొచ్చాక నరకం.. రూ.20 వేల జీతం.. రూ.50 లక్షల అప్పు
వామ్మో.. భలే సీన్.. వందేళ్ల నాటి చర్చ్‌ను ఒక చోట నుంచి మరో చోటకు తరలింపు