Student Debt: అమెరికాలో చదివి ఇండియాకొచ్చాక నరకం.. రూ.20 వేల జీతం.. రూ.50 లక్షల అప్పు
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:46 PM
రూ.50 లక్షల అప్పు చేసి అమెరికాలో చదువుకున్నాక జాబ్ రాకపోవడంతో ఇండియాకు తిరిగొచ్చిన ఓ యువకుడు చివరకు రూ.20 వేల జీతంపై ఓ స్టార్టప్ కంపెనీలో పనిచేయడం మొదలెట్టాడు. లోన్‌కు సంబంధించిన ఈఎమ్ఐలను అతడి తండ్రి తన పెన్షన్‌తో తీరుస్తున్నాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా చదువుల కోసం ప్రయత్నించే వారు కాస్త అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్నారై యువతి నెట్టింట పెట్టిన పొస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. తనకు తెలిసిన వ్యక్తికి ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఆమె ఈ పోస్టు పెట్టింది.
శాన్‌ఫ్రాన్‌సిస్కోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న మహిళ తన స్నేహితుడి సోదరుడికి ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. అతడు ఓ అమెరికా యూనివర్సిటీలో 60 వేల డాలర్లు ఖర్చు పెట్టి డిగ్రీ చదువుకున్నాడని తెలిపింది. ఆ తరువాత జాబ్ ఆఫర్స్ లేక ముంబైకి తిరిగొచ్చేశాడని పేర్కొంది. పైపెచ్చు రూ.50 లక్షల లోన్ భారం నెత్తిపై పడటంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయాడని తెలిపింది.
‘ఇలాంటి ఘటనల గురించి యూనివర్సిటీలు మీకు చెప్పవు. నా ఫ్రెండ్ సోదరుడికి ప్రస్తుతం జాబ్ ఆఫర్స్ ఏమీ లేవు. రూ.20 వేల జీతానికి ఓ స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎడ్యుకేషన్ లోన్‌కు సంబంధించిన వడ్డీలను అతడి తండ్రి తనకొచ్చే పెన్షన్ డబ్బుతో కడుతున్నాడు’ అని ఆమె పేర్కొంది.
అమెరికా చదువులకు ప్లాన్ చేసుకొనేటప్పుడు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించింది. ‘అమెరికా చదువులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నా ఇలాంటి కోణాలు ఉంటాయన్న విషయం మర్చిపోకూడదు. ఒకప్పుడు స్టెమ్ రంగాల్లో డిగ్రీ పట్టా ఉన్న వారికి జాబ్స్ సులభంగా దొరికేవి. ఇప్పుడా పరిస్థితి లేదు’ అని ఆమె పేర్కొంది.
ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇలాంటి అనుభవాల గురించే ప్రజలకు తెలియాలని కొందరు అన్నారు. ఇన్‌స్టాలో జనాలు పెట్టే సక్సెస్ స్టోరీలే కాకుండా ఈ అనుభవాల గురించి తెలిస్తే విద్యార్థులు అన్ని కోణాల్లో ఆలోచించుకుని ముందడుగు వేయగలుగుతారని కామెంట్ చేశారు. యూకే, ఆస్ట్రేలియా, కెనడాల్లో కూడా కొందరు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారని, చివరకు తక్కువ శాలరీలు ఇచ్చే జాబ్స్ చేసేందుకు కూడా సిద్ధపడుతున్నారని అన్నారు.
ఇవీ చదవండి:
స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని అతి చేష్టలు.. ఊహించని షాకిచ్చిన పోలీసులు
వామ్మో.. భలే సీన్.. వందేళ్ల నాటి చర్చ్‌ను ఒక చోట నుంచి మరో చోటకు తరలింపు