Himalayan Red Fox: హిమాలయాల్లో రహదారిపై నక్క.. అటవీ శాఖ అధికారి ఆందోళన
ABN , Publish Date - Dec 24 , 2025 | 08:22 AM
హిమాలయాల్లో ఓ రహదారిపై నక్క తచ్చాడుతూ కనిపించడంపై ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. నక్క ఎదురుచూపుల వెనుక ఓ ప్రమాదకరమైన ఒరవడి ఉందని జనాలను అప్రమత్తం చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతంది.
ఇంటర్నెట్ డెస్క్: మనుషులు తెలియక చేస్తున్న తప్పులు ఇతర జీవాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయంటూ ఓ ఐఎఫ్ఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది (Himalaya Red Fox on Road).
హిమాలయాల్లో కనిపించే ఓ నక్క (హిమాలయన్ రెడ్ ఫాక్స్) పాంగాంగ్ సరస్సుకు సమీపంలోని సంచరిస్తున్న వీడియోను విభోర్ శ్రీవాత్సవ అనే వ్యక్తి ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. పాంగాంగ్ సరస్సుకు సమీపంలోని రోడ్డుపై ఈ నక్క కనిపించిందని, ఈ దృశ్యాన్ని ఎన్నటికీ మర్చిపోనని అన్నారు. ప్రకృతి సౌందర్యం మాటల్లో వర్ణించలేమని చెప్పుకొచ్చారు. జనాలు సహజంగానే ఈ వీడియోను లైకులు, కామెంట్స్‌తో వైరల్ చేశారు. ఎక్స్ వేదికగా కూడా ఈ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. వేల కొద్దీ లైక్స్, వ్యూస్ రాబట్టింది. జనాలను ఎంటర్‌టైన్ చేసింది. కానీ వీడియోలోని ఓ ఆందోళనకర ట్రెండ్‌ను నెటిజన్లు గుర్తించలేకపోయారు (Parveen Kaswan, Worrying Wild life Trend)
నక్క ప్రవర్తనలో వచ్చిన మార్పును ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాస్ ప్రస్తావించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రహదారిపై నక్క వచ్చి, దేని కోసమో ఎదురు చూస్తున్నట్టు ఉండటం ఆందోళనకరమని హెచ్చరించారు. గతంలో వాహనదారులు రహదారిపై నక్కకు ఆహారం పెట్టి ఉంటారని, దానికి అలవాటు పడి మళ్లీ అది రోడ్డుపైకి వచ్చేసిందని అన్నారు. ఇది దాని ఉనికికే ప్రమాదమని అన్నారు. అడవి జంతువులపై ఇలాంటి అలవిమాలిన జాలి, దయ చూపిస్తే వాటి జాతే అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు.
నిపుణులు చెప్పేదాని ప్రకారం, మనిషులు ఇచ్చే ఆహారానికి అలవాటు పడే అడవి జంతవులు తమ సహజసిద్ధ లక్షణాలను కోల్పోతాయి. అడవిలో జీవించడం, వేటాడటం వంటివి మరిచి ఆహారం కోసం జనావాసాల వైపు మళ్లుతాయని హెచ్చరించారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
లద్దాఖ్, ఇతర శీతల పర్వత ప్రాంతాల్లో కనిపించే హిమాలయన్ రెడ్ ఫాక్స్ స్థానిక జీవవైవిధ్యతకు, సమతౌల్యతకు కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఎలుకలను తినే ఈ నక్క వాటి సంతతి హద్దుమీరకుండా చేస్తుంటుంది.
ఇవీ చదవండి:
ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రాజెక్టు.. ఇల్లు అప్పగించని పౌరుడు.. చివరకు..
వాయుకాలుష్యం నుంచి తక్షణ ఉపశమనం.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో