Nail Houses China: ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రాజెక్టు.. ఇల్లు అప్పగించని పౌరుడు.. చివరకు..
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:59 PM
చైనాలో అభివృద్ధి ప్రాజెక్టుకు అడ్డంకిగా మారిన ఓ ఇంటి చుట్టూ రోడ్డును నిర్మించిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చైనాలో ఇలాంటి ఇళ్లను నెయిల్ హౌజెస్‌గా పిలుస్తారట. మరి వీటి వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: జనాభా పెరిగే కొద్దీ కొత్త మౌలిక వసతులు ఏర్పాటు చేయక తప్పదు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తమ ఇళ్లు, జాగాలు వదులుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి ప్రభుత్వాలు పరిహారాలు కూడా చెల్లిస్తుంటాయి. మరి ఆస్తులు వదులుకునేందుకు ప్రజలకు సుతారమూ ఇష్టం లేకపోతే ఏం జరుగుతుంది? ప్రాజెక్టు నిలిచిపోతుందా? అంటే కానే కాదు. ఇలా పీటముడి పడిన సందర్భాల్లో చైనాలో ఏం జరుగుతుందో చెప్పే వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (China Nail House - Viral Video).
అధిక జనాభా ఉన్న చైనాలో అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక వసతుల ఏర్పాటు అంతే వేగంగా జరుగుతుంటుంది. మౌలిక వసతుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రజల నుంచి కూడా స్థలాలను సేకరిస్తుంటుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం తన జాగా వదులుకునేందుకు అస్సలు ఇష్టపడలేదు. ఎన్ని రకాలుగా అధికారులు చెప్పి చూసినా అతడి మనసు మారలేదు.
సదరు వ్యక్తి మనసు మార్చడం కుదరదని భావించిన ప్రభుత్వం చివరకు రోడ్డు అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు చేస్తూ రోడ్డు నిర్మాణ ప్రాజక్టును పూర్తి చేసింది. కాంట్రాక్టర్లు అతడి ఇంటిపక్కగా రోడ్డు నిర్మించి ప్రాజెక్‌ను పూర్తి చేశారు. అనంతరం మరింత అభివృద్ధి చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. కానీ ఆ ఇల్లు మాత్రం అలాగే ఉండిపోయింది. చివరకు ఓ మచ్చలా మిగిలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చైనాలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఇళ్లు ఉన్నాయట. వీటిని అక్కడి వారు నెయిల్ హౌజెస్ అని పిలుస్తారు. అంటే, గోడలో పూర్తిగా దిగబడని మేకు లాగా ఎబ్బెట్టుగా కనిపించే ఇల్లని అర్థం.
ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. నగరానికి నడిమధ్యలో నివసించడం అంటే ఇదేనని కొందరు అన్నారు. కాలినడకన ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఆ ఇల్లు కోసం ఇంతలా మొండిపట్టు పట్టడం ఎందుకని మరికొంతమంది ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
యువకుడి జీవితంలో ట్విస్ట్.. దురదృష్టం వెంటాడటంతో..
35 ఏళ్ల వయసులో జాబ్ పోయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడెలా? టెకీ ఆవేదన