N95 Effectivenes Video: వాయుకాలుష్యం నుంచి తక్షణ ఉపశమనం.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
ABN , Publish Date - Dec 21 , 2025 | 10:41 AM
కాలుష్యం నుంచి ఎన్95 మాస్కులు ఎంతటి రక్షణ కల్పిస్తాయో కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. వైద్యులు కూడా ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర భారతం ప్రస్తుతం కాలుష్యంతో సతమతం అవుతోంది. వాయు నాణ్యత సూచీ అనేక ప్రాంతాల్లో 200ల మార్కును దాటుతోంది. దీంతో, ప్రజలు హడలెత్తిపోతున్నారు. పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియక సతమతం అవుతున్నారు. తక్షణ తరుణోపాయాల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్95 మాస్కుల ప్రభావశీలతను చాటి చెప్పే ఓ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది (N95 Effectiveness Viral Video).
కరోనా సంక్షోభ సమయంలో యావత్ ప్రపంచానికి మాస్కుల ఉపయోగం గురించి పూర్తిగా తెలిసింది. ముఖ్యంగా ఎన్95 మాస్కులు ఎంతటి ప్రభావశీలమైనవో జనాలు అర్థం చేసుకున్నారు. అయితే, తాజాగా ఎన్95 మాస్కు సామర్థ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కాలుష్యం బారిన పడకుండా ఇవి జనాలను ఎలా రక్షించగలవో ఓ వ్యక్తి తన వీడియోలో చూపించాడు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ముంబైలో ఆ వ్యక్తి గాలి నాణ్యతను తెలిపే పరికరాన్ని ఉపయోగించాడు. వాయునాణ్యత సూచీ దాదాపు 195గా ఉన్నట్టు పరికరంలో కనిపించింది. ఆ తరువాత అతడు పరికరానికి ఎన్95 మాస్క్‌ను తొడిగాడు. దీంతో, ఒక్కసారిగా భారీ మార్పు కనిపించింది. మాస్క్ కాలుష్యాన్ని చాలా వరకూ అడ్డుకోవడంతో పరికరంలోకి స్వచ్ఛమైన గాలి వెళ్లింది. దీంతో, ఏక్యూఐ ఒక్కసారిగా 40కి దిగిపోయింది. మళ్లీ మాస్క్ తొలగించగానే సూచీ పైకి ఎగబాకింది. కాబట్టి, ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్యం బారినపడకుండా ఉండేందుకు ఎన్95 మాస్కులను వినియోగించాలని అతడు సూచించాడు.
ఇక ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు ఎన్95 మాస్కులు ధరించాలని అనేక మంది కామెంట్ చేశారు. మరికొందరు సెటైర్లు కూడా పేల్చారు. ప్రభుత్వం ఈ మాస్కులను ఢిల్లీలోని ఏక్యూఐ మానిటర్లకు తొడిగి కాలుష్యం తగ్గినట్టు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. ఇక మెడికల్ ప్రొఫెషనల్స్ అనేక మంది ఈ వీడియోపై స్పందించారు. నేటి జమానాలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్95కి మించినది లేదని తేల్చి చెప్పారు.
ఇవీ చదవండి:
ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రాజెక్టు.. ఇల్లు అప్పగించని పౌరుడు.. చివరకు..
యువకుడి జీవితంలో ట్విస్ట్.. దురదృష్టం వెంటాడటంతో..