New Delhi Pollution: దట్టమైన పొగమంచు.. ఢిల్లీలో మరింత పెరిగిన వాయుకాలుష్యం
ABN , Publish Date - Dec 14 , 2025 | 08:24 AM
ఢిల్లీలో నేటి ఉదయం వాయుకాలుష్యం పీక్స్‌కు చేరింది. రోహిణి ప్రాంతంలో ఏక్యూఐ సూచీ అత్యధికంగా 499 పాయింట్స్‌కు చేరింది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీఆర్ఏపీ-4 నిబంధనలను అమలు చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం వాయునాణ్యత మరింతగా తగ్గింది. పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 462కు చేరింది. దట్టమైన పొగ మంచు నగరాన్ని కప్పేయడంతో ఢిల్లీ వాసులు అవస్థలు పడుతున్నారు (New Delhi Pollution-Smog).
రాజధానిలోని అన్నీ మానిటరింగ్ స్టేషన్‌లల్లో వాయునాణ్యత సూచీ రెడ్ కేటగిరీకి చేరింది. రోహిణి ప్రాంతంలో సూచీ అత్యధికంగా 499 పాయింట్స్‌కు చేరింది. ఇక జహాంగిర్‌పురి, వివేక్ విహార్ ప్రాంతంలో కూడా ఏక్యూఐ 495కి చేరింది. అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది వాహనాల హెడ్‌లైట్స్ వేసుకుని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ప్రయాణిస్తున్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం వాయునాణ్యత సూచీ 401-500 మధ్య ఉంటే కాలుష్య తీవ్రతను రెడ్ కేటగిరీగా పరిగణిస్తారు. ఆరోగ్యవంతులకు కూడా హానిచేసే స్థాయిలో కాలుష్యం పెరిగినట్టు రెడ్ క్యాటగిరీ సూచిస్తుంది. ఈ సమయాల్లో ఆరు బయటకు వెళ్లడం శ్రేయస్కరం కాదని వైద్యులు చెబుతున్నారు.
భారత్‌లో ఏక్యూఐ స్కేలు 500 పాయింట్స్ వరకే ఉంటుంది. ఇంతకుమించిన కాలుష్యాన్ని కూడా అధికారులు రెడ్ కేటగిరీలోనే చేరుస్తారు. 500కి మించిన ఏక్యూఐతో ఎలాగూ ప్రమాదమే, ప్రత్యేకంగా ఈ సంఖ్యను చూపించి ప్రజలను భయాందోళనకు గురిచేయడంతో ప్రయోజనం సూన్యమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ప్రొఫెసర్ డా. గుఫ్రాన్ బెయిగ్ తెలిపారు.
మరోవైపు వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శనివారం జీఆర్ఏపీ-4 ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, అత్యవసరం కాని ట్రక్కులు ఢిల్లీలోకి రాకుండా నిషేధం విధించారు. ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రం యథావిధిగా ఢిల్లీలోకి వెళ్లొచ్చు. రాజధానిలో రిజిస్టర్ అయిన బీఎస్-4, అంతకుముందున్న డీజిల్ వాణిజ్య వాహనాల రాకపోకలపై కూడా నిషేధం ఉంది. నిర్మాణ సంబంధిత పనులకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వివిధ కార్యాలయాల్లోని సుమారు 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
నైట్ క్లబ్స్‌లో బాణసంచాపై నిషేధం.. గోవా కీలక నిర్ణయం
మహారాష్ట్రలో చిరుత కలకలం.. భవనాల మధ్య దూకుతూ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి