UK Work Culture: బ్రిటీషర్ల నుంచి నేను నేర్చుకున్నవి ఇవే.. ఎన్నారై పోస్టు వైరల్
ABN , Publish Date - Dec 17 , 2025 | 09:33 AM
బ్రిటీషర్ల నుంచి తాను కొన్ని అలవాట్లను నేర్చుకున్నానంటూ ఓ ఎన్నారై నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొందరు అతడి అభిప్రాయాలతో విభేదిచండంతో ఇది పెద్ద చర్చకు దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ జనాల నుంచి తను నేర్చుకున్నది ఏమిటో చెబుతూ ఓ ఎన్నారై పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. పని సంస్కృతి, ఉత్పాదకత, వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై తన ఆలోచనా తీరే మారిపోయిందంటూ అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట పెద్ద డిబేట్‌ను స్టార్ట్ చేసింది.
సుమిత్ రాజవర్ అనే వ్యక్తి ఈ వీడియోను పంచుకున్నారు. బ్రిటన్ జనాల అలవాట్లు స్ఫూర్తిమంతంగా ఉంటాయని చెప్పారు. సుదీర్ఘసమయం పాటు ఆఫీసులో పని చేస్తే ఉత్పదాకత పెరుగుతుందని తాను గతంలో భావించేవాడినని తెలిపారు. నిబద్ధతకు అది సంకేతం అని అనుకునేవాణ్ణి అని అన్నారు. కానీ బ్రిటన్ జనాలను చూశాక తనకు పొరపాటు ఏమిటో అర్థమైందని చెప్పారు. వాళ్లల్లో తనకు నచ్చిన ఐదు అలవాట్లను షేర్ చేశారు.
అతడు చెప్పిన వివరాల ప్రకారం..
బ్రిటన్ జనాలు ఆఫీసుల్లో పని ముగించుకుని సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకల్లా ఇళ్లకు బయలుదేరుతారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ కానీ, పశ్చాత్తాపం కానీ ఉండదు.
పని సమయంలో పూర్తి ఏకాగ్రత పెడతారు. ఎలాంటి కాలక్షేపాలు ఉండవు. దీంతో, పని సకాలంలో పూర్తవుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. కాబట్టి, ఆఫీసుల్లో పనివేళలప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.
బ్రిటన్ ఆఫీసుల్లో పార్టీలు, సరదాలు సర్వసాధారణం. అయితే, పార్టీలు, వేడుకల వల్ల రాత్రి ఎంత లేటుగా ఇంటికెళ్లినా తెల్లారి మళ్లీ సరైన టైమ్‌కు ఆఫీసుకు వచ్చేస్తారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవు.
సెలవులు, వారాంతాల్లో ఆఫీసు పనులను అసలేమాత్రం చేయరు. ఆఫీసు నుంచి ఫోన్ కాల్స్, మెసేజీలను అస్సలు సహించరు. ఎవరి హద్దుల్లో వారు ఉండాల్సిందే.
ఇక ఏటా సంస్థలు ఇచ్చే సెలవులను ఉద్యోగులు యథేచ్ఛగా వాడుకోవచ్చు. మేనేజర్లు, పైఅధికారులను బతిమలాడటాలు వంటి సీన్స్ కనిపించవు. తమ సెలవులను ప్లాన్ చేసుకుని మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించి లీవ్ పెట్టుకోవచ్చు.
ఈ పోస్టుపై అనేక మంది ప్రశంసలు కురిపించినా కొందరు మాత్రం ఇది పూర్తిగా సరికాదని అన్నారు. వారు ఏ రంగంలో పని చేస్తున్నారనేదానిపై పని వేళలు ఆధారపడి ఉంటాయని చెప్పుకొచ్చారు. కొన్ని రంగాల్లోని వారు పనివేళలతో నిమిత్తం లేకుండా ఆఫీసుల్లో ఉంటారని చెప్పారు.
ఇవీ చదవండి:
కెనడా నుంచి తిరిగొచ్చాక.. 600 జాబ్స్‌కు అప్లై చేస్తే..
తెల్లవారుజామున ఊహించని సీన్! దుబాయ్‌లో భారతీయ మహిళకు ఆశ్చర్యం