Montha Cyclone Naming Convention: మొంథా తుఫానుకు ఆ పేరును ఎవరు పెట్టారో తెలుసా?
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:07 PM
మొంథా అనే పేరుకు అర్థం ఏమిటి? అసలు తుఫాన్లకు పేర్లు ఎందుకు పెడుతున్నారు? అనే సందేహాలు మీకెప్పుడైనా కలిగాయా? అయితే ఈ కథనం మీకోసమే.
ఇంటర్నెట్ డెస్క్: మొంథా.. ప్రస్తుతం జానల్ని భయపెడుతున్న పేరిది. ఈ తుఫాను కారణంగా ఏపీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే తీరం దాటిన తుఫాను క్రమంగా బలహీనపడుతోంది. అసలు తుఫాన్లకు పేర్లు ఎందుకు పెడుతున్నారు? మొంథా పదానికి అర్థం ఏమిటి? అనే సందేహాలు చాలా మందికి ఈపాటికే వచ్చి ఉంటాయి. అయితే, ఈ సంప్రదాయం వెనక శాస్త్రపరమైన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు (Montha Meaning).
మొంథా పేరుకు అర్థం ఇదీ
తాజా తుఫానుకు థాయ్‌లాండ్ దేశం మొంథా అనే పేరును నిర్ణయించింది. మొంథా అంటే సుందరమైన లేదా సువాసనలు వెదజల్లే పువ్వు అని అర్థం. హిందూ మహాసముద్రం ఉత్తర భాగంలో జనించే తుఫాన్లకు మొత్తం 13 దేశాలు పేర్లు పెడుతుంటాయి. ఇందుకోసం ముందస్తుగానే పేర్లతో కూడిన జాబితాను రెడీ చేశాయి. తుఫాన్లు, వాటి ప్రభావాలు, జరిగిన నష్టం తదితర విషయాలను పక్కాగా ముదింపు వేసి, సమాచారం సేకరించి పెట్టుకునేందుకు వీలుగా శాస్త్రవేత్తలు తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయానికి తెరతీశారు. అయితే, తుఫాను తీవ్రతకు, దానికి పెట్టే పేరుకు ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం వాటిని ఓ క్రమపద్ధతిలో గుర్తించి, అవసరమైన సమయాల్లో అలర్టులు జారీ చేసేందుకు వీలుగా పేర్లను కేటాయిస్తారు (Cyclone Naming Convetion).
తుఫాన్లకు నామకరణం ఇలా..
తుఫాన్లకు పేర్లు నిర్ణయించే ప్రక్రియను భారత వాతావరణ శాఖ పర్యవేక్షిస్తుంది. తుఫాన్లకు పెట్టాల్సిన పేర్లను ఆయా దేశాలు ముందుగానే నిర్ణయిస్తాయి. వీటితో కూడిన జాబితా ఎల్లప్పుడూ రెడీగానే ఉంటుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్.. ఇలా హిందూమహా సముద్ర ప్రాంతం లోని 13 దేశాలు ఈ పేర్లను నిర్ణయిస్తాయి. లిస్టులోని పేర్లను క్రమపద్ధతిలో తుఫాన్లకు కేటాయిస్తారు. బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రంలో వాయుగుండం మొదలై గాలుల వేగం గంటకు 62 కిలోమీటర్లకు చేరినప్పుడు భారత వాతావరణ శాఖ.. జాబితాలోని తదుపరి పేరును ముందుగా అనుకున్న ప్రకారం కేటాయిస్తుంది. ఆ తరువాత వచ్చే తుఫానుకు లిస్టులోని తరువాతి పేరును ప్రకటిస్తారు. ఇక తుఫాన్ పేర్ల లిస్టు ప్రకారం, ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో (బంగాళాఖాతం, అరేబియా సముద్రం) భవిష్యత్తులో వచ్చే తుఫానుకు సెన్యార్ అని పేరు పెడతారు. ఈ పేరును యూఏఈ నిర్ణయించింది. ఒకసారి వాడిన పేరును మరోసారి వినియోగించరు.
మొంథా తుఫాను బంగాళాఖాతంలో మొదలైంది. తొలుత అల్పపీడనంగా మొదలై, క్రమంగా బలం పుంజుకుని తీవ్ర తుఫానుగా మారింది. ఏపీ తీరంవైపు దూసుకొస్తుందని, 28న తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ ముందే ప్రకటించింది. ఈ మేరకు ఎప్పటికప్పుడు ప్రమాద తీవ్రతను బట్టి హెచ్చరికలను జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
హైవేపై పోలీసుల ఛేజింగ్.. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో.. వైరల్ వీడియో
మూడో పర్యాయం అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ట్రంప్ మక్కువ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి