Donald Trump: మూడో పర్యాయం అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ట్రంప్ మక్కువ
ABN , Publish Date - Oct 28 , 2025 | 08:12 AM
మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకు తనకు ఇష్టమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అన్నారు. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకూ దృష్టి పెట్టలేదని కూడా చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: మరోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు తనకు ఇష్టమేనని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 2028 అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని అన్నారు. ట్రంప్ మూడోసారీ అధ్యక్షుడిగా ఉండాలన్న శ్వేత సౌధం మాజీ సలహాదారు స్టీవ్ బ్యానన్ సూచనపై ఆయన ఈ మేరకు స్పందించారు. తనకు ప్రజల్లో మద్దతు ఉందని కూడా చెప్పారు. అయితే ఇప్పటివరకూ ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదని కూడా ట్రంప్ అన్నారు (Donald Trump Third Term).
పార్టీలో తన వారసుల గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్‌లల్లో ఎవరో ఒకరు తన తరువాత పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. ‘కొందరు సమర్థులైన వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు’ అని మార్కో వైపు చేయి ట్రంప్ చేయి చూపించారు. ‘జేడీ వ్యాన్స్ కూడా అద్భుతమైన నాయకుడే. వీళ్లిద్దరినీ సవాలు చేసేవారు పార్టీలో లేరనే అనుకుంటున్నా’ అని అన్నారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తికి రెండు సార్లకు మించి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే అవకాశం లేదు. అయితే, స్టీవ్ బానన్ మాత్రం ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కావాలని సూచిస్తున్నారు. ఇందుకు ఓ ప్రణాళిక కూడా ఉందని చెబుతున్నారు. అయితే, ట్రంప్‌కు అనుకూలంగా రాజ్యాంగ సవరణ తేవడం చాలా కష్టమని అమెరికా న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇందుకు అమెరికా చట్టసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో 75 శాతం మద్దతు తెలపాలని చెబుతున్నారు.
గతంలో ఫ్రాంక్లిన్ డీ రూసవెల్ట్ 1933-45 మధ్యలో అమెరికాకు ఏకంగా నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తరువాత 22వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక వ్యక్తికి రెండు పర్యాయాలకు మించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం లేకుండా చేశారు. ఇక ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మలేషియాలోని ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి:
పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు
పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి