Jaishankar on UN: పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 10:40 PM
ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు లేక కార్యకలాపాలు స్తంభించే స్థితికి వచ్చాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ క్లిష్టసమయంలో సంస్థకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ విషయంలో ఐక్యరాజ్య సమితి వ్యవహరిస్తున్న తీరుపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ విమర్శలు గుప్పించారు. ఉగ్రవాద మూకలకు కొమ్ము కాస్తున్న పాక్ తీరును కూడా ఎండగట్టారు. ఇలాంటి పరిణామాలపై ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోలేకపోతోందని అన్నారు. సంస్కరణలు లేక ఐక్యరాజ్య సమితి పని స్తంభించిపోయిందని వ్యాఖ్యానించారు. యూనైటెడ్ నేషన్స్‌ను నెలకొల్పి 80 సంత్సరాలు గడిచిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి జైశంకర్ ఈ కామెంట్స్ చేశారు (Minister Jaishankar on UN Reforms).
ఉగ్రవాద మూకలను, బాధితులను ఒకేగాటన కట్టడంపై మంత్రి జైశంకర్ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి పలు సవాళ్లను ఎదుర్కుంటోందని అన్నారు. భద్రతా మండలి సభ్య దేశమే పహల్గాం దాడి కారకులకు వత్తాసు పలుకుతుంటే అంతర్జాతీయ వ్యవస్థల విశ్వసనీయత ప్రమాదంలో పడుతుందని అన్నారు. భౌగోళిక రాజకీయ వ్యూహాల పేరిట టెర్రరిస్టులకు మద్దతు పలకొద్దని ఆయన హెచ్చరించారు.
ఐక్యరాజ్య సమితిలో చర్చలు ఏకపక్షంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూఎన్ పనితీరు స్తంభించిపోతోందని చెప్పారు. సంస్కరణలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అన్నారు. అంతర్జాతీయంగా శాంతి భద్రతలు కాపాడటంలో యూఎన్‌కు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇది అభివృద్ధికి, సామాజిక ఆర్థిక పురోగతికి ప్రతిబంధకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యూఎన్‌లో లోపాలు ఉన్నప్పటికీ ఈ వ్యవస్థకు మద్దతుగా నిలవడం అనివార్యమని అన్నారు. బహుళధ్రువ ప్రపంచానికి కచ్చితంగా కట్టుబడి ఉండాలని అన్నారు.
పాక్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పహల్గాం దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ప్రకటనలో టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ ప్రస్తావన లేకుండా చేసేందుకు దాయాది దేశం చాలా ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలు భారత్ ఎండగట్టింది. పాక్ చర్యలకు మౌనంగా మద్దతు తెలుపుతున్న దేశాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి:
పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్
అప్ఘానిస్థాన్‌తో ఘర్షణలు.. పాక్‌లో 400 శాతం మేర పెరిగిన టమాటా ధరలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి