Afghan Dam on Kunar River: పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:57 PM
నానాటికీ రెచ్చిపోతున్న పాక్‌కు భారత్ స్టైల్లో బుద్ధి చెప్పేందుకు అప్ఘాన్ సిద్ధమైంది. కునార్ నదిపై డ్యామ్ నిర్మించేందుకు రెడీ అవుతోంది. నదీ జలాల నిలిపివేతతో పాక్‌కు బుద్ధి వచ్చేలా చేయాలని భావిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ వక్రబుద్ధిని ప్రదర్శనిస్తున్న పాక్‌కు బుద్ధి చెప్పేందుకు భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా అఫ్ఘానిస్థాన్ కూడా ఇదే తరహా రివెంజ్‌కు సిద్ధమైంది. పాక్‌కు కునార్ నదీ జలాలను నిలిపివేసేందుకు డ్యామ్‌ల నిర్మాణానికి నిర్ణయించుకుంది. ఈ మేరకు అఫ్ఘానిస్థాన్ సుప్రీం లీడర్ మలావీ హబితుల్లా అఖుంజాదా స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. కునార్ నదిపై డ్యామ్‌లు నిర్మించేందుకు నిర్ణయించుకున్నట్లు అఫ్ఘానిస్థాన్ జలవనరుల శాఖ మంత్రి ఎక్స్ వేదికగా ప్రకటించింది. వీలైనంత త్వరగా ఆనకట్టల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
తమ జలవనరులను తమ అవసరాలకు అనుగుణంగా నిర్వహించుకునే హక్కు అఫ్ఘానీలకు ఉందని మంత్రి అన్నారు. విదేశీ సంస్థలకు బదులు దేశీ సంస్థలే నిర్మాణ పనులు చేపడతాయని కూడా చెప్పారు. పాక్‌తో సరిహద్దు వెంబడి ఘర్షణలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తాలిబాన్లు కూడా రంగంలోకి దిగారు. పాక్ దూకుడుకు ముకుతాడు వేసేందుకు బహుళ అంచెల వ్యూహాలను రచిస్తున్నారు. ఇందులో భాగంగా డ్యామ్ నిర్మాణాల అంశం తెరపైకి తెచ్చారు.
తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థను తమ మీదకు అప్ఘానిస్థాన్ ఉసిగొల్పుతోందని పాక్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అప్ఘాన్ రాజధాని కాబుల్‌లో టీటీపీ ఉగ్రవాదులు దాక్కున్నట్టు అనుమానాలున్న ప్రాంతాలపై ఏకంగా పాక్ వైమానిక దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఆ తరువాత సరిహద్దు వెంబడి ఇరు దేశాల దళాలు దాడులకు దిగాయి. ప్రస్తుతం రెండు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే, ఆగ్రహంతో ఉన్న అఫ్ఘానిస్థాన్ పాక్‌ను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది.
ఏమిటీ కునార్ నది..
పాక్‌లోని ఖైబర్ పాక్‌తూన్‌ఖ్వా ప్రావిన్స్ చిత్రాల్ జిల్లాలో గల హిందూకుష్ పర్వతాల్లో జన్మించిన ఈ నది దక్షిణం వైపుగా పయనించి అఫ్ఘానిస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. నది మొత్తం పొడవు 500 కిలోమీటర్లు. ఇది అప్ఘాన్‌లోని కునార్, నన్‌గర్హర్ ప్రావిన్సుల మీదుగా ప్రయాణిస్తూ చివరకు కాబుల్ నదిలో కలుస్తుంది. అనంతరం, కాబుల్ నదీ తూర్పు దిశగా ప్రవహిస్తూ పాక్ భూభాగంలోకి ప్రవేశించి అటాక్ నగరం వద్ద సింధు నదిలో కలుస్తుంది.
ఇవి కూడా చదవండి:
అప్ఘానిస్థాన్‌తో ఘర్షణలు.. పాక్‌లో 400 శాతం మేర పెరిగిన టమాటా ధరలు
కెనడాకు తగ్గిన అంతర్జాతీయ విద్యార్థులు.. మునుపెన్నడూ చూడని విధంగా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి