Canada Immigration: కెనడాకు తగ్గిన అంతర్జాతీయ విద్యార్థులు.. మునుపెన్నడూ చూడని విధంగా..
ABN , Publish Date - Oct 23 , 2025 | 03:01 PM
కెనడాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఆగస్టులో కెనడాకు వెళ్లిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 60 శాతం మేర పడిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: కెనడా ప్రభుత్వ కఠిన విధానాల కారణంగా ఆ దేశానికి అంతర్జాతీయ విద్యార్థులు వెళ్లడం భారీగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 60 శాతం మేర పడిపోయింది. విద్యార్థి వీసా, తాత్కాలిక ఉద్యోగి వీసా విధానాల్లో 2023లో తీసుకొచ్చిన మార్పుల కారణంగా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా కోత పడుతోంది (Canada international students decline).
వీసా అర్హత నిబంధనలు కఠినతరం చేయడం, వీసాల జారీపైనా పరిమితులు విధించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు. కెనడాలో నివాస, మౌలిక వసతులపై ఒత్తిడి తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం 2024 తొలి నాళల్లో విద్యార్థి వీసాల సంఖ్యపై పరిమితి విధించింది. ఏటా 3.60 లక్షల స్టడీ వీసాలు మాత్రమే జారీ చేయాలని నిర్ణయించింది. ఇక ఈ ఏడాది మొదట్లో ఈ పరిమితిని మరో 10 శాతం మేర తగ్గించారు (60% drop in International Student Arrivals).
దీనితో పాటు వీసా మోసాలు నిరోధించేందుకు ప్రతి ఎక్సెప్టెన్స్ లెటర్‌కు ధ్రువీకరణ తప్పనిసరి చేశారు. వీసా జారీకి సంబంధించి ఆర్థిక నిబంధనలను కూడా ప్రభుత్వం కఠినతరం చేసింది. కెనడాలో ఆర్థికంగా విద్యార్థులకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు, వీసా జారీ ప్రక్రియ కూడా నెమ్మదించింది. ఫలితంగా ఈ విద్యాసంవత్సరంలో కెనడాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టులో 45,380 మంది అంతర్జాతీయ విద్యార్థులు కెనడాకు వెళ్లారు. అంతకుముందు ఏడాదిలో ఈ సంఖ్య ఏకంగా 1,17,400గా ఉందంటే వలసల నిబంధనలు ఎంత కఠినంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, వలసలు నిరోధించడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. లేబర్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సుస్థిరవిధానంలో వలసలను ప్రోత్సహించాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి..
చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్‌లో సీఎంకు ఘన స్వాగతం
వార్సాలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!