California Cop Chase: హైవేపై పోలీసుల ఛేజింగ్.. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో.. వైరల్ వీడియో
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:45 PM
హత్య చేసి పారిపోతున్న నిందితుడిని పోలీసులు హైవేపై వెంటాడి మరీ అరెస్టు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై దూసుకుపోతున్న నిందితుడిని అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇది సినిమాను తలదన్నేలా ఉన్న హైవే ఛేజింగ్ సీన్! గంటకు 240 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై నిందితుడు పారిపోతున్నాడు. అతడిని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు డిసైడయ్యారు. తమ వాహనాల్లో వెంబడించారు. అతడు కాస్త నెమ్మదించగానే తమ కారుతో పక్క నుంచి ఢీకొట్టారు. దీంతో నిందితుడి బైక్ బ్యాలెన్స్ తప్పి పల్టీలు కొట్టింది. ఆ దెబ్బకు కింద పడిపోయిన నిందితుడు చివరకు పోలీసులకు చిక్కాడు (High speed Police chase in California).
ఓ పోలీసును హత్య చేసి పారిపోతున్న అతడిని అమెరికా పోలీసులు ఇలా సినీ ఫక్కీలో అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నార్డినో కౌంటీలో తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియోను స్వయంగా పోలీసులే నెట్టింట పంచుకున్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (San Bernardino deputy killed).
హాలీహాక్ కౌంటీలో ఓ వ్యక్తి తుపాకీతో మహిళను బెదిరిస్తున్నట్టు పోలీసులకు సోమవారం సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చూడగానే నిందితుడు కాల్పులకు దిగాడు. ఈ క్రమంలో ఆండ్రూ నూనెజ్ అనే పోలీసు అధికారికి తూటా తగలడంతో అతడు నేలకొరిగాడు. ఈలోపు నిందితుడు బైక్‌పై మెరుపు వేగంతో అక్కడి నుంచి పారిపోయాడు.
వెంటనే పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. నిందితుడి కోసం వేట మొదలెట్టాయి. బైక్‌పై మెరుపు వేగంతో హైవేపై దూసుకుపోతున్న అతడిని వ్యూహాత్మకంగా అడ్డుకుని అరెస్టు చేశాయి. బైక్‌పై నుంచి పడటంతో నిందితుడికి గాయాలు అయినప్పటికీ ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని చెప్పారు. నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.
తమ సహచరుడిని కోల్పోవడంపై పోలీసు చీఫ్ డికస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తమ గుండెల్ని పిండేస్తోందని అన్నారు. మనసున్న వ్యక్తిని, మంచి స్నేహితుడిని కోల్పోయామని అన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నూనెజ్‌కు భార్య, రెండేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రెగ్నెంట్. ఈ సమయంలో భర్తను కోల్పోవడంతో ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
మూడో పర్యాయం అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ట్రంప్ మక్కువ
పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి