Bill Gates: మనుషుల అవసరం అంతగా ఉండకపోవచ్చు.. ఏఐపై బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్య
ABN , Publish Date - Feb 07 , 2025 | 08:38 PM
ఏఐ అభివృద్ధితో భవిష్యత్తులో అనేక పనులకు మనుషుల అవసరం ఉండకపోవచ్చని బిల్ గేట్స్ తాజాగా అభిప్రాయపడ్డారు. ది టునైట్ షోలో పాల్గొన్న ఆయన ఓ ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏఐ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతిక అభివృద్ధిపై అనిశ్చితి నెలకొన్న విషయాన్ని అంగీకరించిన ఆయన.. ఇది నిజంగా ఆందోళన కరమేనని అన్నారు. జిమ్మీ ఫ్యాలన్ వ్యాఖ్యాతగా ఉన్న ది టునైట్ షోలో పాల్గొన్న బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత వ్యవస్థలపై విచ్ఛిన్నకర ప్రభావం చూపే సామర్థ్యం ఏఐకి ఉందని బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఏఐ అభివృద్ధి అసాధారణ వేగంతో సాగుతోందని ఇప్పటికే నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజం, ఉద్యోగాల లభ్యత, ఆర్థిక వ్యవస్థలపై ఏఐ ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో గేట్స్ ది టునైట్ షోలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు (Bill Gates).
Infosys Layoffs: ఉద్యోగుల్ని బలవంతంగా తొలగిస్తున్నారంటూ వార్తలు.. వివరణ ఇచ్చిన ఇన్ఫోసిస్!
నిపుణులైన టీచర్లు, డాక్టర్ల కొరత ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఈ సవాళ్లకు ఏఏఐతో సమాధానం దొరుకుతుందని గేట్స్ ఈ షోలో పేర్కొన్నారు. ఏఐతో విద్యార్థులకు త్వరలో హై క్వాలిటీ శిక్షణ, వైద్య సలహాలు పైసా ఖర్చు లేకుండా అందుబాటులోకి రావచ్చని అన్నారు. ఈ పరిణామం సంప్రదాయిక విద్య, వైద్య విధానాలపై పెను ప్రభావం చూపిస్తుందని అన్నారు. ఉద్యోగాలపై కూడా ప్రభావం ఉంటుందని గేట్స్ పేర్కొన్నారు. భవిష్యత్తులో చాలా పనులకు మనుషుల అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. సాధారణ పనులతో పాటు సంక్లిష్ట పనులు కూడా ఏఐ చక్కబెట్టే స్థితి వస్తుందని, తద్వారా ఉద్యోగుల వారానికి సగటు పని దినాలు మరింత తగ్గిపోతాయని స్పష్టం చేశారు. ఏఐపై నియంత్రణ ఇంకా చర్చల దశలోనే ఉందని కూడా గేట్స్ పేర్కొన్నారు. ఏఐతో రిస్క్‌లు.. మహమ్మారులు, అణుయుద్ధంతో సరిసమానమని అన్నారు.
Ratan Tata Will: రతన్ టాటా వీలునామాలో మిస్టరీ వ్యక్తి! ఆయనకు ఎంత ఆస్తి వచ్చిందంటే..
ఇటీవల చైనా డీప్‌సీక్ ఏఐ రంగంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చాట్‌జీపీటీ లాంటి భారీ ఎల్ఎల్ఎమ్ మోడళ్లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, తక్కువ కంప్యూటర్ హార్డ్‌వేర్ సామర్థ్యంతో నడిచేలా డీప్‌సీక్ ఏఐ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకూ ఏఐ అభివృద్ధికి అత్యధిక సామర్థ్యం గల కంప్యూటర్ చిప్స్ కావాలన్న అభిప్రాయం ఉండేది. పలితంగా చిప్స్ తయారీ సంస్థ ఎన్‌వీడియాకు డిమాండ్ పెరిగింది. సంస్థ షేర్ ధరకు రెక్కలొచ్చాయి. అయితే, డీప్‌సీక్ రాకతో ఎన్‌విడియా షేర్లు భారీగా పతనమయ్యాయి.