Ratan Tata Will: రతన్ టాటా వీలునామాలో మిస్టరీ వ్యక్తి! ఆయనకు ఎంత ఆస్తి వచ్చిందంటే..
ABN , Publish Date - Feb 07 , 2025 | 06:34 PM
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా తన వీలునామాలో మోహినీ మోహన్ దత్తా అనే వ్యక్తికి తన ఆస్తుల్లో మూడో వంతు వదిలి వెళ్లారు. దత్తా గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవడంతో ఎవరీ మిస్టరీ వ్యక్తి అన్న చర్చ మొదలైంది.

ఇంటర్నెట్ డెస్క్: దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా తన వీలునామాలో మోహినీ మోహన్ దత్తా అనే వ్యక్తికి తన ఆస్తుల్లో మూడో వంతు వదిలి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఆయన గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియకపోవడంతో ఎవరీ మిస్టరీ వ్యక్తి అన్న చర్చ మొదలైంది. టాటా ఆంతరంగికులకు కూడా మోహన్ దత్తా గుర్తించి చాలా పరిమితంగా తెలుసన్న విషయం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. దత్తాకు రతన్ టాటా రూ.500 కోట్ల విలువైన ఆస్తులు బదిలీ చేశారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వీలునామాలో దత్తా పేరు కూడా ఉన్నప్పటికీ హైకోర్టు ధ్రువీకరణ అనంతరం ఆస్తుల బదిలీ జరుగుతుందని సమాచారం. దీనంతటికీ ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Ratan Tata: రతన్ టాటా విజయ రహస్యాలు ఇవే..
ఎవరీ మోహినీ మోహన్ దత్తా..
జమ్‌షెడ్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త మోహినీ మోహన్ దత్తా స్టాలియన్ బ్రాండ్ సహ యజమానుల్లో ఒకరు. స్టాలియన్ బ్రాండ్ ప్రస్తుతం టాటా సర్వీసెస్‌లో ఒక ముఖ్య భాగం. టాటా సంస్థల్లో విలీనానికి ముందు దత్తాకు స్టాలియన్‌లో 80 శాతం వాటా ఉండేది. మిగిలిన వాటా టాటా ఇండస్ట్రీస్ చేతుల్లో ఉండేది.
ఇక టాటా అంత్యక్రియలకు హాజరైన దత్తా తాము యువకులుగా ఉన్నప్పుడు తమ మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపారు. తన ఎదుగుదలలో రతన్ టాటాది కీలక పాత్ర అని కూడా ఓ సందర్భంలో దత్తా పేర్కొన్నారు. దత్తా, రతన్ టాటా అనుబంధానికి దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక గతేడాది డిసెంబర్‌లో జరిగిన రతన్ టాటా జయంత్యుత్సవానికి కూడా దత్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టాటా సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఇక మోహన్ దత్తా కుమార్తె 2015 వరకూ తాజ్ హోటల్స్‌లో ఉన్నారు. ఆ తరువాత గతేడాది వరకూ టాటా ట్రస్టుల్లో సేవలందించారు.
రతన్ టాటా స్వర్గస్తులైన రెండు నెలల తరువాత ఆయన వీలునామా ప్రజల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తన ఆస్తికి వారసులుగా టాటా పలువురిని పేర్కొన్నారు. తన సోదరుడు, సవితి చెల్లెళ్లు, ఇంట్లోని కొందరు సహాయకులు, తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడి పేర్లు వీలునామాలో చేర్చారు. తన పెంపుడు కుక్క టీటోకు ఎటువంటి లోటూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రతన్ టాటా వీలునామా ప్రకారం, టాటా సన్స్‌లో ఆయన వాటా రతన్ టాటా ఎండోవ్‌మెంట్ ట్రస్టుకు బదిలీ అవుతుంది. టాటా ఆస్తుల్లో అలీబాగ్‌లోని బీచ్ బంగ్లా, జుహూలోని రెండస్తుల ఇల్లు, రూ.350 కోట్లు విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, టాటా సన్స్‌లో వాటాలు ఉన్నాయి.