Share News

Nara Lokesh: ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయండి: మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Dec 10 , 2025 | 06:45 AM

ఏపీ సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు బలమైన ఎకో సిస్టమ్ కలిగి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. శాన్ ఫ్రాన్సిస్కో‌లో ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు.

Nara Lokesh: ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయండి: మంత్రి నారా లోకేశ్
Minister Nara Lokesh

ఇంటర్నెట్ డెస్క్, డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి): ఏపీ సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు బలమైన ఎకో సిస్టమ్ కలిగి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. శాన్ ఫ్రాన్సిస్కో‌లో ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడారు మంత్రి లోకేశ్.


విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC) పరిధిలో ఈ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలతో పాటు తమకు బలమైన రాజకీయ సంకల్పం ఉందని పేర్కొన్నారు. ఇది సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీకి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. ఇంటెల్ సాంకేతిక నైపుణ్యం, గ్లోబల్ ప్రభావం ఏపీ రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP) యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.


ఇంటెల్ స్థాపనతో యాన్సిలరీ సప్లయర్స్, కాంపోనెంట్ తయారీ సంస్థలను రాష్ట్రం ఆకర్షిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నెక్ట్స్ జెన్ టెక్నాలజీ నాయకత్వం సాధించే లక్ష్యాన్ని కలిగి ఉందని చెప్పుకొచ్చారు. ఇంటెల్ ఏఐ హార్డ్‌వేర్ (ఉదా: Habana Labs, Gaudi Accelerators), HPC, ఎడ్జ్ కంప్యూటింగ్ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అని వివరించారు.


‘ఇంటెల్ – అమరావతి ఏఐ రీసెర్చ్ సెంటర్’ను శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీ లేదా ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇంటెల్ ఆధారిత HPC క్లస్టర్లు ఏర్పాటు చేసి విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య, వ్యవసాయం, వాతావరణ నమూనా పరిశోధనలకు మద్దతు ఇవ్వాలని కోరారు.


తమ ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కృషిచేస్తున్న నేపథ్యంలో ఇంటెల్ భవిష్యత్ నైపుణ్య వర్క్ ఫోర్స్ అవసరాన్ని తీర్చేందుకు ప్రపంచ ప్రసిద్ధ శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.


రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ పాఠ్యప్రణాళికలో ఇంటెల్ శిక్షణా కార్యక్రమాలు (ఉదా: Intel Digital Readiness, AI for Youth) చేర్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.


ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో ‘ఇంటెల్ స్కిల్ ల్యాబ్స్’ స్థాపించి... వీఎల్ఎస్ఐ డిజైన్, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ మూలాలు, ఏఐ, రోబోటిక్స్‌పై ప్రత్యేక శిక్షణ అందించాలని కోరారు. ఆర్ అండ్ డీ సంస్కృతిని పెంపొందించడానికి, హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లను సంయుక్తంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. సెమీ కండక్టర్స్ చిప్, జీపీయూ, సీపీయూ డిజైనింగ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో ఇంటెల్ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని చెప్పుకొచ్చారు. $180 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను ఇంటెల్ సంస్థ కలిగి ఉందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన

ప్రియమైన ఎన్నారై టీడీపీ సైనికులారా కదలిరండి: జయరామ్ కోమటి

Read Latest and NRI News

Updated Date - Dec 10 , 2025 | 07:48 AM