Yogi Adityanath: ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:48 PM
యూపీలో 2017కు ముందు వ్యవస్థను నిలిపివేసే ట్రెండ్ నడిచిందని, కానీ 2017 తర్వాత నుంచి ఒక్క కర్ఫ్యూని కూడా తాము అనుమతించలేదని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అప్పటి నుంచే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కథ మొదలైందని వివరించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ (Bareilly)లో జరిగిన హింసాత్మక ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నిప్పులు చెరిగారు. వ్యవస్థను ఎవరు అడ్డుకున్నా తమ ప్రభుత్వం అమలుచేసే శిక్ష తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. శనివారం నాడిక్కడ జరిగిన 'వికసిత్ యూపీ' కార్యక్రమంలో సీఎం యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఐ లవ్ మహమ్మద్' ప్రచారానికి మద్దతుగా నిరసనలకు పిలుపునిచ్చిన స్థానిక మతాధికారి, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ఖాన్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి యోగీ సూటిగానే ఈ హెచ్చరికలు చేశారు. 'నిన్న, ఒక మౌలానా రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో మర్చిపోయినట్టున్నారు. ఈ వ్యవస్థను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేస్తానని ఆయన అనుకుంటున్నారేమో. కానీ మేము ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాం. రోడ్ల దిగ్బంధన కావచ్చు, కర్ఫ్యూ కావచ్చు.. అల్లర్లకు పాల్పడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా భవిష్యత్ తరాల వారికి మేము గట్టి గుణపాఠం చెప్పితీరుతాం' అని యోగి వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో 2017కు ముందు వ్యవస్థను నిలిపివేసే ట్రెండ్ నడిచిందని, కానీ 2017 తర్వాత నుంచి ఒక్క కర్ఫ్యూని కూడా తాము అనుమతించలేదని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అప్పటి నుంచే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కథ మొదలైందని వివరించారు.
బరేలీలో శుక్రవారం నాడు హింసాకాండ చెలరేగింది. మౌలానా తౌఖిర్ రజా ఇచ్చిన పిలుపుతో 'ఐ లవ్ మహమ్మద్' ప్రచారంలో భాగంగా మసీదు సమీపంలో పెద్దఎత్తున జనం గుమిగూడారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. ఈ ఘటనలో 22 మంది పోలీసులు గాయపడగా, పలు మారణాయుధాలు పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. హింసాకాండకు ప్రేరేపించిన రజాతో సహా 8 మందిని పోలీసులు జైలుకు పంపారు. మొత్తం 39 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా 'ముందస్తు కుట్ర'లో భాగమేని డీఐజీ అజయ్ కుమార్ సాహ్ని తెలిపారు. వీడియో సాక్ష్యాలతో హింసకు పాల్పడిన వారందరినీ గుర్తించి కఠినమైన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
'ఐ లవ్ మహమ్మద్' నిరసనలు హింసాత్మకం.. తౌకీర్ రజా ఖాన్ అరెస్టు
వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధాలు.. లద్దాఖ్ హింసపై డీజీపీ ప్రకటన
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి