Bareilly Violence: 'ఐ లవ్ మహమ్మద్' నిరసనలు హింసాత్మకం.. తౌకీర్ రజా ఖాన్ అరెస్టు
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:47 PM
బరేలిలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రదర్శకులు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు.
బరేలి: ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో 'ఐ లవ్ ముహమ్మద్' (I Love Muhammad) ప్రచారం హింసాత్మకంగా మారడంతో పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఈ ప్రచారానికి పిలుపునిచ్చిన స్థానిక మతాధికారి, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ఖాన్ (Tauqeer Raza Khan)ను శనివారం నాడు అరెస్టు చేసింది. బరేలిలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రదర్శకులు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇందుకు బాధ్యులైన రజాతో సహా ఎనిమిది మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని జైలుకు పంపారు. పది ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిలో ఎనిమిది ఎఫ్ఐఆర్‌లలో రజా నిందితుడిగా ఉన్నారు.
ఉద్రిక్తతలు ఇలా..
శుక్రవారం ప్రార్ధనల అనంతరం పెద్దఎత్తున కొత్వాలి ఏరియాలోని మసీదు వెలుపల జనం గుమిగూడారు. 'ఐ లవ్ మహమ్మద్' పోస్టర్లు పట్టుకుని పోలీసులతో ఘర్షణకు దిగారు. రజా ప్రతిపాదించిన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించడం, చివరి నిమిషంలో ప్రదర్శన నిలిచిపోవడంతో ఆ గుంపు రెచ్చిపోయినట్టు చెబుతున్నారు.
జైలుకు రజా
హింసాత్మక ఘటనల అనంతరం రజాతో సహా 8 మందిని జైలుకు పంపినట్టు పోలీసులు తెలిపారు. రాళ్లు రువ్వడంతోపాటు విధ్వంసానికి పాల్పడిన మొత్తం 39 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలి నుంచి పిస్తోళ్లు, పెట్రోల్ బాటిళ్లు, బాటన్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు బరేలీ ఎస్ఎస్‍పీ అనురాగ్ ఆర్య తెలిపారు.
గాయపడిన 22 మంది పోలీసులు
శుక్రవారం నాడు జరిగిన హింసాత్మక దాడుల్లో 22 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్టు ఎస్ఎస్‌పీ వివరించారు. వీరిలో పలువురు మారణాయుధాల కారణంగా గాయపడ్డారని, మెడికల్ పరీక్షలు జరుపుతున్నామని చెప్పారు. ఆందోళనకారులు కాల్పులు జరిపారనేది నిస్సందేహమన్నారు. 2500 మంది నుంచి 3000 మంది గుర్తుతెలియని వ్యక్తులు ఇందులో పాల్గొన్నారని, వారిని గుర్తించే పనిలో ఉన్నామని వివరించారు. నదీమ్ అనే వ్యక్తి ఫోన్ కాల్స్, వాట్సాప్‌తో పలువురితో కాంటాక్ట్ జరిపినట్టు తెలిసిందని, ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.
'ఐ లవ్ మహమ్మద్' వివాదం
ఈనెల 4న 'ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబి' ఊరేగింపు సందర్భంగా 'ఐ లవ్ మహమ్మద్' బోర్డులు ఉంచడంపై కాన్పూరు పోలీసులు కొరడా ఝుళిపించారు. 24 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంప్రదాయానికి భిన్నంగా, రెచ్చగొట్టేందుకు ఈ బోర్డులు ఏర్పాటు చేశారంటూ పలు హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వివాదం ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పాకింది. ఉత్తరాఖండ్, కర్ణాటకలోనూ నిరసనలు వ్యక్తం కావడం, పోలీసు యాక్షన్ చోటుచేసుకున్నాయి. 'ఐ లవ్ మహమ్మద్' అనడం తప్పెలా అవుతుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
రూ.60,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ
సొమ్ము చెల్లిస్తే చెక్ బౌన్స్ నుంచి విముక్తి!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి