Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై మహిళా అధికారుల వివరణ.. కారణమిదే..

ABN , First Publish Date - 2025-05-07T12:36:51+05:30 IST

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. అయితే ఈ ఆపరేషన్‌ గురించి వివరించేందుకు ఇద్దరు ధైర్యవంతులైన మహిళా అధికారులు మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఓ కారణం ఉంది...

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై మహిళా అధికారుల వివరణ.. కారణమిదే..

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఈ భారీ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకూ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారని ప్రాథమిక సమాచారం. అయితే ఈ ఆపరేషన్‌ గురించి వివరించేందుకు ఇద్దరు ధైర్యవంతులైన మహిళా అధికారిణులు మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఓ కారణం ఉంది.


భారత ఆర్మీ (Indian Army) చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌‌కు (Operation Sindoor) సంబంధించిన పూర్తి వివరాలను భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత సైన్యంలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషి (vyomika singh and colonel sofiya qureshi) మీడియాకు వివరించారు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషులను చంపడంతో మహిళలు వితంతువులుగా మారారు. వారి గౌరవార్థం.. ఆపరేషన్ 'సిందూర్' పేరుతో ప్రతీకార దాడులు చేసింది. ఈ ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులే తెలియజేయడం కూడా ఆపరేషన్ 'సిందూర్'లో భాగమని తెలుస్తోంది. పాకిస్తాన్ పుట్టించిన ఉగ్రవాద కర్మాగారాలు ఏ విధంగా లక్ష్యం చేయబడ్డాయో వారు వెల్లడించారు. పాకిస్తాన్‌లో ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు ఆమె ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా దాన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని వ్యోమిక సింగ్ అన్నారు.


కల్నల్ సోఫియా ఖురేషి ప్రస్తుతం లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. కాగా వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కల్నల్ సోఫియా ఖురేషి ఉత్తమ నాయకురాలిగా పేరు గడించారు. ఆమె పూణేలో నిర్వహించిన ‘ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18’ అనే అంతర్జాతీయ సైనిక విన్యాస కార్యక్రమంలో భారత బృందానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు.


మరోవైపు వింగ్ కమాండర్‌ వ్యోమికా సింగ్‌కు చిన్ననాటి నుంచే విమానాలపై ప్రేమతో భారత సైన్యంలో చేరాలని కోరిక ఉండేదట. ఆమె ప్రస్తుతం హెలికాప్టర్ పైలట్‌గా పని చేస్తున్నారు. ప్రమాదరకర ప్రాంతాల్లోనూ విమానాలను నడిపిన అనుభవం ఆమెకు ఉంది. ఇప్పటి వరకు ఆమెకు సుమారు 2,500 గంటలకుపైగా విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. ఈశాన్య భారత రాష్ట్రాలతో పాటూ జమ్మూ కాశ్మీర్ లాంటి కఠినమైన వాతావరణాల్లో ఆమె చేతక్, చీతా తరహా హెలికాప్టర్లను నడిపి రికార్డ్ సృష్టించారు.

Updated Date - 2025-05-07T15:33:32+05:30 IST