DK Shivakumar: సీఎం ఆశలు సజీవం.. సంకేతాలిచ్చిన డీకే
ABN , Publish Date - Dec 30 , 2025 | 09:14 PM
సుపరిపాలన అందించాలన్నదే తమ కొత్త సంవత్సర సంకల్పమని డీకే చెప్పారు. ఈ ఏడాది లాగే వచ్చే ఏడాది కూడా రాష్ట్రంలో పుష్కలంగా వానలు పడాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
బెంగళూరు: ముఖ్యమంత్రి పదవిపై ఆశలు సజీవంగా ఉన్నట్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మంగళవారంనాడు సంకేతాలిచ్చారు. 2026లో సీఎం కానున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన నవ్వుతూ '2026లో మనం మాట్లాడుకుందా' అని సమాధానమిచ్చారు.
సుపరిపాలన అందించాలన్నదే తమ కొత్త సంవత్సర సంకల్పమని డీకే చెప్పారు. 'ఈ ఏడాది లాగే వచ్చే ఏడాది కూడా రాష్ట్రంలో పుష్కలంగా వానలు పడాలని ప్రార్థిస్తున్నా. ప్రజాసాధికారత కోసం ప్రవేశపెట్టిన ప్రభుత్వ హామీ పథకాలు కొనసాగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే ఏడాది నిర్వహిస్తాం' అని తెలిపారు. సుపరిపాలన మీ నాయకత్వంలోనే అందించనున్నారా అని అడిగినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో సుపరిపాలన కొనసాగుతుందన్నారు. మరో ఏడున్నరేళ్ల పాటు కాంగ్రెస్ సుపరిపాలన కొనసాగుతుందని, 2028 ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు.
కాగా, 2026-27 బడ్జెట్‌ను కూడా తానే ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత నవంబర్‌లో తెలిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఇది తన 17వ బడ్జెట్ అవుతుందన్నారు. పార్టీ అధిష్టానం మొగ్గు తనవైపే ఉందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. 2026 మార్చిలో కర్ణాటక వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
ఇవి కూడా చదవండి..
అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ట ద్వాదశి వేడుకలకు రాజ్‌నాథ్ సింగ్
ఖలీదా జియా అంత్యక్రియలకు జైశంకర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి