Share News

Rain Forecast: ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్.. ఆగస్టు 17 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు

ABN , Publish Date - Aug 11 , 2025 | 10:41 AM

దేశవ్యాప్తంగా మళ్లీ వర్షాల వెదర్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) అప్రమత్తమై పలు రాష్ట్రాల్లో వానలు ముప్పును గుర్తించి రెడ్, ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Rain Forecast: ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్.. ఆగస్టు 17 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు
Across Several States Rain Alert

దేశవ్యాప్తంగా వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారిపోతోంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ-NCR, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు నుంచి ఏడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని (IMD Rain Forecast) తెలిపింది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనవసర యాత్రలు చేయొద్దని సూచిస్తున్నారు ఐఎండీ అధికారులు.


ఢిల్లీ-NCRలో వర్షం

ఢిల్లీ-NCR ప్రాంతంలో వచ్చే మూడు రోజులు (ఆగస్టు 12-14) వర్షాలు కురుస్తాయని IMD చెబుతోంది. ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ అయింది. గరిష్ట ఉష్ణోగ్రత 34-36°C మధ్య, కనిష్ట ఉష్ణోగ్రత 26-28°C మధ్య ఉంటుందట. ఆగస్టు 13, 14 తేదీల్లో వర్షం కారణంగా చల్లగా అనిపిస్తుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, లక్నో, గోరఖ్‌పూర్, వారణాసి, మీరట్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇక్కడ రోజువారి ఉష్ణోగ్రత 32-35°C, రాత్రి 24-27°C మధ్య ఉంటుంది.


బీహార్‌లో గంగా నది

బీహార్‌లోని దక్షిణ జిల్లాలు గయా, పట్నా, నవాడా, భాగల్పూర్‌లలో ఆగస్టు 12 నుంచి 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ అయింది. నవాడాలో గంగా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటుతోంది. ఉత్తర బీహార్‌లో మోస్తరు వర్షాలతో పాటు 40-50 కి.మీ/గంట వేగంతో గాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాబట్టి, ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.


రెడ్ అలర్ట్, పాఠశాలలు మూసివేత

ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 12న రెడ్ అలర్ట్ జారీ అయింది. ఉత్తర కాశీ, రుద్ర ప్రయాగ్, చమోలీ, బాగేశ్వర్, పిథోరాగఢ్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో 13 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. ఆగస్టు 13, 14 తేదీలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. డెహ్రాడూన్, బాగేశ్వర్‌లలో భారీ వర్షాల కారణంగా పాఠశాలలు మూసివేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.


హిమాచల్ ప్రదేశ్‌లో ఆరెంజ్ అలర్ట్!

హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్, సోలన్, షిమ్లా, సిర్మౌర్, మండీ, చంబా, కాంగ్రా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆగస్టు 12న భారీ వర్షాలు, ఆ తర్వాత 13, 14 తేదీల్లో మోస్తరు వర్షాలతో పాటు 30-40 కి.మీ/గంట వేగంతో గాలులు వీస్తాయని అంచనా.

వారం రోజులు వర్షాలు!

మన తెలంగాణలో కూడా ఆగస్టు 17 వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. ఆగస్టు 13 నుంచి 17 వరకు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.


ఇవి కూడా చదవండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 11 , 2025 | 10:45 AM