Share News

Al Jazeera Journalists Killed: గాజాలో మళ్లీ హింసాత్మక దాడి..ఐదుగురు జర్నలిస్టులు మృతి

ABN , Publish Date - Aug 11 , 2025 | 09:28 AM

గాజాలో హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శిఫా హాస్పిటల్ గేట్‌ వద్ద జరిగిన దాడుల్లో అల్ జజీరా న్యూస్ ఛానల్‌కు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది.

Al Jazeera Journalists Killed: గాజాలో మళ్లీ హింసాత్మక దాడి..ఐదుగురు జర్నలిస్టులు మృతి
Al Jazeera Journalists Killed Gaza

గాజాలో దాడులు రోజు రోజుకు మరింత ఎక్కువవుతున్నాయి. గాజాలోని శిఫా హాస్పిటల్ గేట్‌ వద్ద జరిగిన ఓ దారుణ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ మిలిటరీ జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని చేసిన దాడిలో, అల్ జజీరా న్యూస్ ఛానల్‌కు చెందిన ఐదుగురు జర్నలిస్టులు (Al Jazeera Journalists Killed Gaza) మరణించారు. వారిలో అల్ జజీరా కరస్పాండెంట్లు అనస్ అల్-షరీఫ్, మొహమ్మద్ క్రీకెహ్, కెమెరామెన్లు ఇబ్రహీం జహెర్, మొహమ్మద్ నౌఫల్, మొఆమెన్ అలీవా ఉన్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛపై తీవ్ర చర్చను తెరపైకి తెచ్చింది.


తీవ్రవాది అని..

ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే, ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. అనస్ అల్-షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నామని, అతను ఒక తీవ్రవాది అని, హమాస్‌లో ఒక టెర్రరిస్ట్ సెల్ హెడ్ గా పనిచేశాడని తెలిపింది. కానీ అనస్ ఒక ప్రముఖ జర్నలిస్ట్ కూడా. అతను గాజాలో జరుగుతున్న సంఘటనలను నిత్యం రిపోర్ట్ చేసేవాడు. అతని చివరి క్షణాల్లో, అతను Xలో గాజా సిటీపై ఇజ్రాయెల్ బాంబు దాడుల గురించి పోస్ట్ చేశాడు. అతని మరణ సమయంలో తన ఖాతా నుంచి ఒక పోస్ట్ పబ్లిష్ అయ్యింది. దాన్ని అతని స్నేహితుడు పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.


200 మంది మీడియా కార్యకర్తలు

అనస్ అల్-షరీఫ్ చివరి పోస్ట్ ఇలా ఉంది. నా ఈ మాటలు మీకు చేరితే, ఇజ్రాయెల్ నన్ను చంపడంలో, నా గొంతు నొక్కడంలో సఫలమైందని తెలుసుకోవాలని పేర్కొన్నాడు. అనస్ తన జీవితాన్ని ప్రజల కోసం, వారి కష్టాలను ప్రపంచానికి చెప్పడానికి అర్పించాడు. అతను జబలియా శరణార్థి శిబిరంలో పెరిగాడు, అక్కడి నుంచి ప్రపంచానికి గాజా నిజాలను చూపించాడు.

ఈ దాడి గాజాలో 22 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో జర్నలిస్టులపై జరిగిన తాజా దాడి. ఇప్పటివరకు సుమారు 200 మంది మీడియా కార్యకర్తలు ఈ యుద్ధంలో మరణించారని పలు నివేదికలు చెబుతున్నాయి. అల్ జజీరా దీనిని లక్ష్యంగా చేసుకున్న దాడిగా అభివర్ణించింది. వారి ఒక యాంకర్ తన సహోద్యోగుల మరణం గురించి రిపోర్ట్ చేస్తూ కన్నీరు పెట్టుకుంది.


CPJ, ఇతరుల స్పందన

ఈ ఘటనపై Committee to Protect Journalists (CPJ) తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ మళ్లీ జర్నలిస్టులను ఉగ్రవాదులుగా అభివర్ణిస్తూ ఎలాంటి నిబంధనలను పాటించకుండా ప్రాణాలను తీస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని CPJ ప్రాతినిధి సారా ఖుదా అన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇజ్రాయెల్, అల్ జజీరా మధ్య సంబంధాలు గతంలోనూ ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఈ దాడితో సంబంధాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 11 , 2025 | 09:50 AM