Shashikala: ఇక.. చిన్నమ్మ దారెటోమరి.?
ABN , Publish Date - Dec 18 , 2025 | 01:24 PM
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అందరూ చిన్నమ్మగా పిలిచే శశికళ దారెటు.., ఆమె నిర్ణయం ఏమిటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరో కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో.. ఆమె ఎవరికి మద్దతుగా నిలుస్తారో అన్ని పలువురు చర్చించుకుంటున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి.. ఆ పార్టీపై పట్టు సాధించాలనుకున్న ‘చిన్నమ్మ’ శశికళ(Shashikala) ఆశలు అడియాశలుగా మారినట్లు కనిపిస్తోంది. తనతో పాటు తన సమీప బంధువు అమ్మామక్కల్ మున్నేట్ర కళగం అధినేత దినకరన్, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వమ్(ఓపీఎస్) వంటి వారందరినీ ఎలాగోలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్నాడీఎంకే గొడుకు కిందకు తీసుకొచ్చేందుకు శశికళ చేసిన రాయబారాలు విఫలమవడంతో ఆమె తలపట్టుకున్నారు. మరోవైపు ఆమె ప్రయత్నాలు ఫలించవని తేలిపోవడంతో దినకరన్, ఓపీఎస్ వంటివారంతా తమదారి తాము చూసుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక శశికళ అయోమయంలో పడిపోయారు. తాను ముఖ్యమంత్రి పీఠమెక్కనున్నట్లు తెలిసిన వెంటనే తన గుమ్మం ముందు చేతులు కట్టుకుని బారులుతీరిన నేతలంతా ఇప్పుడు తలెగరేసి ధిక్కరిస్తుండటంతో ఆమె తీవ్ర నిరాశలో పడిపోయారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాల్లో శశికళ జైలుకెళ్లడం, ఆ తరువాత ఆమె పార్టీ నుంచి బహిష్కృతురాలవడం.. అనంతరం ఆమె నేతలంతా ఏకతాటిపైకి రావాలంటూ పలు రోడ్‌షోలు చేపట్టడం తెలిసిందే. ఇవన్నీ ఫలించకపోవడంతో ఆఖరి ప్రయత్నంగా బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడారు శశికళ.
తనను, ఓపీఎస్‌ను పార్టీలో చేర్చుకుంటే చాలని.. అంతకుమించి తమకేమీ వద్దంటూ పంపిన రాయబారాన్ని ప్రస్తుత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు సైతం ఆయన మాటలకు తలూపక తప్పలేదు. ఈ నేపథ్యంలో దినకరన్ అన్నాడీఎంకేతో పాటు బీజేపీపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఫలితంగా.. ఆయన అన్నాడీఎంకే కూటమికి చేరువ కావడం కలేనని తేలిపోయింది. మరోవైపు ఓపీఎస్ కూడా ఎన్‌డీఏ కూటమికి దూరమైనట్లు కనిపించారు. అంతలోనే ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయినా బీజేపీ నుంచి ఎలాంటి హామీ దక్కలేదని తెలుస్తోంది.

అయితే.. ఇన్నాళ్లుగా శశికళ సూచనలు, సలహాలతో ముందుకు సాగిన దినకరన్, ఓపీఎస్.. ఇప్పుడు ఆమెను పూర్తిగా దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. తమకు తాముగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు లేశమాత్రమైనా ఆమెకు సమాచారం ఇవ్వడం లేదని తెలిసింది. అంతేగాక గతంలో శశికళ బయటకు వెళ్తే ఆమె వెంట ఓపీఎస్, దినకరన్ వర్గాలకు చెందిన కార్యకర్తలుండేవారు. కానీ, ప్రస్తుతం ఆమె పక్కన రక్షకభటులు తప్ప మరెవ్వరూ కనిపిండం లేదు. ఇటీవల మధురై మీనాక్షి అమ్మవారిని శశికళ దర్శించుకున్నప్పడు ఆమె వెంట సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఎవరూ కనిపించలేదు.
ఈ విషయమై శశికళ వర్గీయులను ప్రశ్నించగా.. తన వెంట ఎవరూ రావద్దని ఆమె చెప్పారన్నారు. అదేవిధంగా శశికళ గురించి దినకరన్ ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఓపీఎస్ సైతం చిన్నమ్మ గురించి నోరెత్తడం లేదు. ఎవరైనా మీడియా ప్రతినిధులు ప్రస్తావించినా ఆయన చిరునవ్వే తప్ప, పెదవి విప్పడం లేదు. నిన్నమొన్నటి దాకా తన చుట్టూ తిరిగిన ఓపీఎస్, దినకరన్.. తలో దారిని ఎంచుకుని వెళ్లిపోవడంతో శశికళ తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ
Read Latest Telangana News and National News