Bihar Assembly Elections: సీట్ల కేటాయింపుపై జితన్ రామ్ మాంఝీ మనస్తాపం
ABN , Publish Date - Oct 13 , 2025 | 02:47 PM
హెచ్ఏఎం (సెక్యులర్)తో పాటు సీట్ల షేరింగ్‌లో భాగంగా రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కు కూడా ఆరు సీట్లు దక్కాయి. రాష్ట్రంలో బిగ్ బ్రదర్ ఎవరనే ప్రసక్తి లేకుండా జేడీయూ, బీజేపీ చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్)కు 6 సీట్లు కేటాయించడంపై ఆ పార్టీ సుప్రీం, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) స్పందించారు. తమ పార్టీకి కేవలం ఆరు సీట్లు కేటాయించడంతో మనస్తాపం చెందినట్టు చెప్పారు. అయితే ఎన్డీయే (NDA) నిర్ణయాన్ని తాను వ్యతిరేకించడం లేదన్నారు. కేంద్రంలోనూ, బిహార్‌లోనూ అధికార కూటమిని పటిష్టం చేసేందుకు తమ కృషి కొనసాగుతుందని చెప్పారు.
'ప్రధాన మంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బిహార్‌కు ఎంతో చేశారు. సీట్ల షేరింగ్ విషయంలో నాయకత్వానికి మేము బాసటగా ఉంటాం. నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ఎన్డీయే పటిష్టతకు కృషి చేస్తాం. బిహార్‌లో ప్రభుత్వాన్ని ఎన్డీయే ఏర్పాటు చేయనుంది' అని మాంఝీ చెప్పారు. తాము 15 సీట్లు అడిగినప్పటికీ కేవలం ఆరు సీట్లే ఇచ్చారని, దీనిపై మనస్తాపం చెందినప్పటికీ ఎన్డీయే నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదని అన్నారు. దక్కిన సీట్లతోనే ముందుకు వెళ్తామని తెలిపారు.
హెచ్ఏఎం (సెక్యులర్)తో పాటు సీట్ల షేరింగ్‌లో భాగంగా రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కు కూడా ఆరు సీట్లు దక్కాయి. రాష్ట్రంలో బిగ్ బ్రదర్ ఎవరనే ప్రసక్తి లేకుండా జేడీయూ, బీజేపీ చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ రెండు పార్టీల తర్వాత కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సారధ్యంలోని లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) ఎక్కువ లబ్ధి పొందింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాలను ఆ పార్టీ గెలుచుకోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 29 సీట్లు కేటాయించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో నవంబర్ 6,11 తేదీల్లో జరుగనుండగా, నవంబర్ 14న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి..
ఐఆర్‌సీటీసీ హోటల్స్ టెండర్స్ కేసు.. ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్
పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి