Share News

Vijay: మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:11 AM

తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని, ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే అని ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్‌ ప్రకటించారు

Vijay: మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ

ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే.. ఈ రెండు పార్టీలను తరిమికొట్టడమే లక్ష్యం

  • స్టాలిన్‌.. వెరీ వెరీ వరస్ట్‌ అంకుల్‌

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

  • ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు

  • రాజకీయాల్లో తేల్చుకునేందుకే వచ్చా

  • మదురై సభలో టీవీకే అధినేత విజయ్‌

  • నీట్‌ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్‌

  • సభకు భారీఎత్తున వచ్చిన ప్రజానీకం

చెన్నై, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని, ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే అని ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను తరిమికొట్టడమే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. గురువారం మదురై సమీపంలో జరిగిన పార్టీ ద్వితీయ మహానాడుకు భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ, డీఎంకేకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుందని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన రాజకీయ నాయకుల తరహాలో బీజేపీతో బలవంతంగా పొత్తు పెట్టుకునే సాదాసీదా నాయకుడిని కాదని పరోక్షంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని ఉద్దేశించి ఆయన విమర్శించారు. విజయ్‌ తనను తాను సింహంతో పోల్చుకున్నారు. ‘సింహానికి గుంపులో ఎలా జీవించాలో తెలుసు. ఒంటరిగా ఎలా జీవించాలో కూడా తెలుసు. సింహం వేటాడేందుకు మాత్రమే వస్తుంది. వినోదం కోసం కాదు. అది ఎప్పుడూ బతికున్న జంతువునే వేటాడి ఆహారంగా తీసుకుంటుంది. అలాగే నేనూ రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకునేందుకే వచ్చా’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోమని విజయ్‌ స్పష్టం చేశారు. కేంద్రంలో మూడోసారి ప్రధానిగా గెలిచిన మోదీ.. ప్రజలకు మంచి చేయడానికి అధికారంలోకి వచ్చారో, లేక మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు పన్నేందుకు వచ్చారో తెలియడం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాట ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయామన్న అక్కసుతో రాష్ట్రాభివృద్ధిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీని గెలిపించలేదన్న ఆగ్రహంతోనే కీళడి పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన తమిళుల ప్రాచీన నాగరికతకు సంబంధించిన పరిశోధనలను ఆమోదించడం లేదని ఆరోపించారు. తమిళ జాలర్ల శాశ్వత పరిష్కారం కోసం కచ్చాదీవిని మళ్లీ భారత్‌లో విలీనం చేయాలని, ఇక ఏమాత్రం మొండి వైఖరి ప్రదర్శించకుండా నీట్‌ పరీక్షలు రద్దు చేయాలని విజయ్‌ డిమాండ్‌ చేశారు.


స్టాలిన్‌... వెరీ వెరీ వరస్ట్‌ అంకుల్‌

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్‌ మాట్లాడుతూ.. ‘స్టాలిన్‌ అంకుల్‌! టాస్మాక్‌లో రూ.1,000 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని అంటున్నారు. మహిళలకు వెయ్యి రూపాయలు ఇస్తే చాలా అంకుల్‌? తమకు భద్రతే లేదని మహిళలు చెబుతున్న మాటలు మీకు వినపడవా అంకుల్‌? ఇది చాలక మహిళలంతా మిమ్మల్ని ‘డాడీ’ అని పిలవాలని చెబుతున్నారే.. వాటీజ్‌ దిస్‌ అంకుల్‌.. దిస్‌ ఈజ్‌ వెరీ వెరీ రాంగ్‌ అంకుల్‌... మహిళలనే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, మత్స్యకారులను కూడా మాయమాటలతో మోసగిస్తున్నారే.. వెరీ వెరీ వరస్ట్‌ అంకుల్‌’ అని వ్యాఖ్యానించారు.

సింహానికి గుంపులో ఎలా జీవించాలో తెలుసు. ఒంటరిగా ఎలా జీవించాలో కూడా తెలుసు. సింహం వేటాడేందుకు మాత్రమే వస్తుంది. వినోదం కోసం కాదు... అది ఎప్పుడూ బతికున్న జంతువునే వేటాడి, ఆహారంగా తీసుకుంటుంది. అలాగే నేనూ రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకునేందుకే వచ్చా. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, డీఎంకే పార్టీలను తరిమికొట్టడమే లక్ష్యం.

- విజయ్‌, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు, సినీ నటుడు


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 22 , 2025 | 05:11 AM