Daku Dulhan Arrest: డాకూ దుల్హన్.. వయసు 21.. 12 మందితో పెళ్లి..
ABN , Publish Date - May 02 , 2025 | 02:16 PM
UP Police Arrest Fake Bride: పట్టుమని పాతికేళ్లు నిండలేదు. థ్రిల్లర్ సినిమాను తలపించేలా గ్యాంగ్ ను వెంటేసుకుని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 మందిని పెళ్లిచేసుకుంది. దేశవ్యాప్తంగా రోజుకో పేరు.. పూటకో వేషం వేస్తూ డాకూ దుల్హన్ గా మారింది. ఇంతకీ, ఆమె ఎవరు.. పోలీసులకు ఎలా పట్టుబడిదంటే..
UP Police Arrest Fake Bride: డబ్బు, బంగారం కోసం ఆశపడి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లాడే నిత్యపెళ్లికొడుకులే కాదు. నిత్యపెళ్లికూతుళ్లూ ఇప్పుడు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి కోవకే చెందుతుంది 'డాకూ దుల్హన్' గా ప్రసిద్ధి గాంచిన గుల్షానా రియాజ్ ఖాన్. గుజరాత్‌లో కాజల్, హర్యానాలో సీమా, బీహార్‌లో నేహా, ఉత్తరప్రదేశ్‌లో స్వీటీ.. ఇలా రకరకాల పేర్లతో 21 ఏళ్ల వయసులోనే డజను సార్లు వివాహం చేసుకుంది. గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటుంది గానీ ఎక్కడా కొన్ని గంటలు కూడా నిలబడదు. డబ్బు, బంగారం, ఫోన్లు, విలువైన వస్తువులు అందినకాడికి దోచుకుని ముఠాతో కలిసి వేరేచోటికి ఉడాయిస్తుంది.
వీళ్ల ముఠా ప్రతిసారీ ఒకే స్క్రిప్ట్ అమల్లో పెడుతూ వస్తుంది. పెళ్లయిన వెంటనే వధువును కిడ్నాప్ చేసి నగలు, బంగారం దొంగిలించుకుపోయారు అనేలా వరుడి కుటుంబాన్ని ముఠా ఏమారుస్తుంది. అయితే, ఎప్పటికప్పుడు పేర్లు, గుర్తింపు కార్డులు మార్చుకుంటూ తమ ఐడెంటిటీ బయటపడకుండా జాగ్రత్తపడతారు. మళ్లీ గ్యాంగ్ అంతా కలిసి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొత్త వరుడి కోసం వేట మొదలుపెడతారు. పెళ్లి సంబంధాలు దొరక్క ఇబ్బందిపడుతున్న వారినే ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. నిజ జీవితంలో గుల్షానా రియాజ్ ఖాన్ యుపీలోని జౌన్‌పూర్‌లో దర్జీగా పనిచేసే రియాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లాలోని బస్ఖారి పోలీస్ స్టేషన్ పరిధిలోని కసధ గ్రామ సమీపంలో పోలీసులు డాకూ దుల్హన్ ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గుల్షానాను, ఆమె ముఠాలోని 8 మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ముఠా సభ్యుల నుంచి రూ.72,000 నగదు, ఒక మోటార్ సైకిల్, ఒక బంగారు మంగళసూత్రం, 11 మొబైల్ ఫోన్లు, 3 నకిలీ ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన సోను అనే వ్యక్తి నుంచి పెళ్లి కోసం ఈ ముఠా రూ.80,000 బలవంతంగా వసూలు చేసింది. పెళ్లి రోజున వధువు కిడ్నాప్ గురించి సోను ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే రోడ్లను బ్లాక్ చేసి నిందితులలో ఒకరిని అరెస్టు చేశారు. అతడు అందించిన సమాచారం ఆధారంగా మొత్తం ముఠా గుట్టు రట్టయ్యింది.
Read Also: Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు
PM Modi: ఇక్కడ శశి థరూర్..ఇది కొంత మందికి నిద్ర కూడా పట్టదన్న ప్రధాని మోదీ
Mangaluru: మంగళూరులో హై అలర్ట్.. ఎందుకంటే..