Robert Vadra: ప్రియాంకను ప్రధానిగా కోరుకుంటున్నారు.. రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 09:43 PM
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇటీవల పార్టీ నుంచి ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయాలంటూ వ్యాఖ్యానించారు. దానిపై వాద్రా మంగళవారంనాడు స్పందించారు.
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయాలని చాలా చోట్ల నుంచి డిమాండ్లు వస్తున్నట్టు ఆమె భర్త, పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇటీవల పార్టీ నుంచి ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయాలంటూ వ్యాఖ్యానించారు. దానిపై రాబర్ట్ వాద్రా మంగళవారంనాడు స్పందించారు. ప్రియాంక ముందుకు రావాలనే (ప్రధాని అభ్యర్థిగా) డిమాండ్లు గట్టిగానే ఉన్నాయని, తాను కూడా రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరుతున్నారని చెప్పారు. ప్రస్తుతానికైతే ప్రజా సమస్యలపైనే తమ దృష్టి ఉందని చెప్పారు.
దీనికి ముందు, ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ, ప్రియాంక గాంధీని ప్రధానిని చేస్తే ఆమె తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీలా మంచి ప్రజాదరణ పొందుతారని, శత్రుదేశాలకు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు. ఆసక్తికరంగా బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందూ, క్రిస్టియన్, బౌద్ధులపై కొద్దికాలంగా దాడులు పెరిగిపోవడంపై ప్రియాంక ఇటీవల ఘాటుగా విమర్శించారు. ఈ దాడులను కేంద్రం పరిగణనలోకి తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. హిందూ యువకుడు దీపు చంద్రదాస్ దారుణ హత్య నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
మధ్యప్రదేశ్ ఎస్ఐఆర్‌లో 42 లక్షల ఓట్ల తొలగింపు
దీపూదాస్‌ను అన్యాయంగా చంపేశారు.. ఆడియో సందేశంలో షేక్ హసీనా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి