Delhi Rains: ఢిల్లీలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..
ABN , Publish Date - Sep 02 , 2025 | 07:36 PM
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రోడ్లు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. యమునా నది నీటి మట్టం పెరగడంతో అధికారులు రాజధానిలో వరద హెచ్చరికలు జారీ చేశారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులపై 7-8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో యమునా ఇతర నదుల్లో నీటిమట్టాలు పెరిగాయి. హరియాణాలోని యమునానగర్ జిల్లాలో హత్నికుండ్ బ్యారేజీ నుంచి 29,313 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో యమునాలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రోడ్లు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. యమునా నది నీటి మట్టం పెరగడంతో అధికారులు రాజధానిలో వరద హెచ్చరికలు జారీ చేశారు. గురుగ్రామ్‌లో.. నాలుగు గంటల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షం నమోదైనట్ల అధికారులు తెలిపారు. దీంతో నగరం మొత్తం జలమయం కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు గంటల తరబడి భారీ రద్దీలో చిక్కుకున్నారు.
అయితే ఈరోజు వర్షం కారణంగా కార్పొరేట్ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులను ఇంటి నుండి పని చేయాలని అధికారులు సూచించారు. NCRకి టెక్ హబ్ అయిన గురుగ్రామ్‌లో, హీరో హోండా చౌక్, పటేల్ నగర్, సిగ్నేచర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న అనేక కీలక ప్రాంతాలు భారీగా వరదనీటిలో మునిగిపోయాయి. అలాగే, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సర్వీస్ లేన్‌లో భారీ మొత్తంలో వర్షపు నీరు పేరుకుపోవడంతో దాన్ని మూసివేశారు. కుండపోత వర్షం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వే డ్రైనేజీ వ్యవస్థ కూడా కూలిపోయింది. ఈ రహదారి ఢిల్లీలోని ద్వారకను ఖేర్కి దౌలా, గురుగ్రామ్‌లోని వివిధ మార్గాలను కలుపుతుంది.
ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి(NH-48)పై ట్రాఫిక్ జామ్‌లు, గురుగ్రామ్‌లోని సిగ్నేచర్ టవర్ చౌక్ వద్ద రెండు నుంచి మూడు అడుగుల నీటి నిల్వతో వాహనాలు చిక్కుకున్నాయి. ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ(DDMA) ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి పాత రైల్వే వంతెన(Old Railway Bridge)పై రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముందుజాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరికొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులకు నిర్వహిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్ రన్‌వేలపై నీరు నిలిచిపోవడంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన సంస్థలు ప్రయాణ సూచనలు జారీ చేశాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ(IMD) సెప్టెంబర్ 4 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆకాశం మేఘావృతంగా ఉంటుందని అంచనా వేసింది.
ఈ భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా యమునా బజార్ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించారు. ఢిల్లీ సురక్షితంగా ఉందని తెలిపారు. యమునా నది నీటిమట్టం 207 మీటర్లకు చేరినప్పటికీ, నగరంలో వరద పరిస్థితి నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. గంటగంటకూ పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్
ఎస్‌సీఓ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..