Prashant Kishore: రాహుల్ తరహాలోనే తేజస్వి ఓడిపోతారు.. ప్రశాంత్ కిశోర్ జోస్యం
ABN , Publish Date - Oct 11 , 2025 | 08:39 PM
రఘోపూర్ నుంచి గెలిచే లాలూ, రబ్రీ ముఖ్యమంత్రి పదవులు చేపట్టారనీ, తేజస్వి కూడా రఘోపూర్ నుంచి రెండు సార్లు గెలిచారని, బిహార్ ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
పాట్నా: ఆర్జేడీ (RJD) కంచుకోటగా భావించే రఘోపూర్ (Raghopur) నుంచి ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ఓడిపోతారని జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ 2019లో అమేథీ (Amedhi) నుంచి ఓడిపోయినట్టే తేజస్వీ కూడా రఘోపూర్ నుంచి ఓడిపాతారని అన్నారు. వైశాలి జిల్లాలోని వీవీఐపీ నియోజకవర్గమైన రఘోపూర్ నుంచి ఎన్నికల ప్రచారానికి ప్రశాంత్ కిశోర్ శనివారంనాడు శ్రీకారం చుట్టారు. రఘోపూర్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ రెండుసార్లు, రబ్రీదేవి మూడుసార్లు శాసససభ్యులుగా గతంలో ఎన్నికయ్యారు.
రఘోపూర్ నుంచి గెలిచే లాలూ, రబ్రీ ముఖ్యమంత్రి పదవులు చేపట్టారనీ, తేజస్వి కూడా రఘోపూర్ నుంచి రెండు సార్లు గెలిచారని, బిహార్ ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. అయినప్పటికీ వీవీఐపీ నియోజకవర్గమైన రఘోపూర్ ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. రఘోపూర్ స్థానికులతో తాను ఆదివారంనాడు సమావేశమై తేజస్విపై పోటీకి సరైన అభ్యర్థి ఎవరనే దానిపై చర్చిస్తానని చెప్పారు.
నేను పోటీ చేస్తే..
తేజస్వి యాదవ్‌పై రఘోపూర్ నుంచి జన్‌సురాజ్ తరఫున పోటీ చేస్తారా అనే ప్రశ్నకు ప్రశాంత్ కిశోర్ సూటిగా సమాధానం ఇవ్వాలేదు. 'నేను రఘోపూర్ నుంచి పోటీ చేస్తే తేజస్వి ఇక్కడి నుంచి పారిపోయి మరో సీటుకు కూడా పోటీ చేస్తారు. రాహుల్ గాంధీ కూడా 2019 పార్లమెంటరీ పోల్స్‌లో అమేథీతో పాటు వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో ఓడిపోయారు. తేజస్వి పరిస్థితి కూడా అదే అవుతుంది' అని ఆయన చెప్పారు.
51 మంది అభ్యర్థుల జాబితా విడుదల
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే 51 మంది అభ్యర్థుల జాబితాను ప్రశాంత్ కిశోర్ విడుదల చేశారు. అందులో ఆయన పేరు చోటుచేసుకోలేదు. తాను పోటీ చేయాలా వద్దా అనే దానిపై పార్టీ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పీకే చెప్పారు. మొత్తం 243 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడుతున్నామని తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో నవంబర్ 6,11 తేదీల్లో జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
బెంగాల్ సీఈఓకు మమతా బెదిరింపులు.. ఈసీ సీరియస్
నా సమయం ఎప్పుడొస్తుందో నాకు తెలుసు.. సీఎం ఊహాగానాలపై డీకే
Read Latest Telangana News and National News