Tamilnadu: హిందీ వ్యతిరేక బిల్లుపై వెనక్కి తగ్గిన స్టాలిన్ సర్కార్
ABN , Publish Date - Oct 15 , 2025 | 09:17 PM
డీఎంకే ప్రతిపాదిత బిల్లు ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా హిందీలో హోర్డింగ్‌లు, బోర్డులు, సినిమాలు, పాటలు, పబ్లిక్ ఈవెంట్లలో హిందీ వాడకంపై నిషేధం అమల్లోకి తెస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై బలవంతంగా హిందీని రుద్దటాన్ని వ్యతిరేకిస్తూ చట్టం తీసుకు వస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
చెన్నై: హిందీ భాషపై నిషేధం విధించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనుకున్న తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సర్కార్ ఈ బిల్లును నిలిపి వేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
డీఎంకే ప్రతిపాదిత బిల్లు ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా హిందీలో హోర్డింగ్‌లు, బోర్డులు, సినిమాలు, పాటలు, పబ్లిక్ ఈవెంట్లలో హిందీ వాడకంపై నిషేధం అమల్లోకి తెస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై బలవంతంగా హిందీని రుద్దటాన్ని వ్యతిరేకిస్తూ చట్టం తీసుకు వస్తున్నామని, ఇది తమిళ భాష, సంస్కృతి రక్షణకు తీసుకుంటున్న చర్య అని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా హిందీ ఉపయోగించడం శిక్షార్హమని, ఇది రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని అంటోంది. డీఎంకే నేత టీకేఎస్ ఇలాంగోవన్ ప్రభుత్వ చర్యను సమర్ధించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తాము ఏమీ చేయడం లేదని, దానికి కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
కాగా, హిందీ వాడకంపై నిషేధం విధిస్తూ డీఎంకే తీసుకు రావాలనుకుంటున్న బిల్లును 'పనికిమాలిన బిల్లు'గా బీజేపీ నేత వి సెల్వం పేర్కొన్నారు. భాషను రాజకీయ ఉపకరణంగా వాడరాదని అన్నారు. తిరుపరన్‌కుండ్రం, కరూర్ దర్యాప్తు, ఆర్మ్‌స్ట్రాంగ్ అంశంతో సహా పలు కోర్టు కేసుల్లో అధికార డీఎంకే ఇటీవల ఎదురుదెబ్బలు తిందని, వివాదాస్పద ఫాక్స్‌కాన్ పెట్టుబడుల అంశ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు భాషపై చర్చను తెరపైకి డీఎంకే తీసుకొచ్చిందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లండి.. బిహార్ బీజేపీ కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం
బీజేపీ రెండో జాబితా.. అలీనగర్ నుంచి సింగర్ మైథిలీ ఠాకూర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి