Supreme Seeks Centre: వికలాంగ క్యాడెట్ల దుస్థితిపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:55 PM
మిలిటరీ శిక్షణ అనేది గర్వంగా చెప్పుకునే జర్నీ. కానీ ఈ ప్రయాణంలో పలువురు గాయాల పాలై, సర్వీసు నుంచి తొలగించబడి ఇంటికి వస్తున్నారు. తర్వాత వారి జీవితం చాలా సవాలుగా మారుతుంది. ఈ సమస్యను గమనించిన సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక సూచనలు జారీ చేసింది.
మన దేశంలో మిలటరీ ట్రైనింగ్ అనేది చాలా కీలకమైన ప్రక్రియ. దేశాన్ని రక్షించేందుకు యువత ఎంతో ఉత్సాహంతో ఈ శిక్షణలో పాల్గొంటారు. కానీ ఈ శిక్షణ సమయంలో కొందరు క్యాడెట్లు గాయాలపాలవుతారు. దురదృష్టవశాత్తూ ఈ గాయాల వల్ల వారు వైకల్యంతో బాధపడుతుంటారు. గాయాలు జరగడంతో, వారిని సర్వీసు నుంచి తొలగించి ఇంటికి పంపిస్తున్నారు. ఇక తర్వాత వారి జీవనం చాలా సవాలుగా మారుతుంది. ఈ సమస్యను గమనించిన సుప్రీంకోర్టు స్వయంగా దీనిని కేసుగా (supreme court disabled cadets) స్వీకరించి విచారణ చేపట్టింది.
అలాంటి వారి కోసం
ఓ కథనం ఆధారంగా సమస్యను స్వీకరించిన జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల బెంచ్ దీనిపై విచారణ జరిపింది. సైనిక శిక్షణలో గాయపడి, వైకల్యంతో బాధపడుతున్న క్యాడెట్లు సైనిక సేవ నుంచి తొలగించబడుతున్నారు. వీరి జీవితాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. అలాంటి వారి కోసం ఏం చేయవచ్చని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, రక్షణ, ఆర్థిక, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది.
కీలక సూచనలు
అలాంటి క్యాడెట్లకు మళ్లీ సైనిక సేవలో అవకాశం ఇవ్వడం సాధ్యమేనా? అని పరిశీలించాలని కోర్టు సూచించింది. ఒకవేళ వైద్యం తర్వాత వారు పనిచేయగలిగితే, వారిని తిరిగి సేవలోకి తీసుకోవచ్చా? అని కోర్టు ఆలోచన వెలిబుచ్చింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మరికొన్ని సూచనలు కూడా చేసింది.
క్యాడెట్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.
గాయాల నుంచి కోలుకున్న వారిని తిరిగి సేవలోకి తీసుకోవచ్చా అనే అంశాన్ని పరిశీలించాలి.
శిక్షణలో ఉన్న క్యాడెట్లకు బీమా సౌకర్యం కల్పించాలి.
దివ్యాంగత కారణంగా తొలగించబడిన వారికి అందించే ఎక్స్ గ్రేషియా (తాత్కాలిక ఆర్థిక సహాయం) మొత్తాన్ని పెంచాలి.
వారికి పునరావాసం కల్పించడానికి ప్రత్యేక పథకాలు తీసుకురావాలి
ఇది భవిష్యత్తులో రాబోయే శిక్షణార్థుల భద్రత కోసం కూడా ఎంతో కీలకం కానుంది
దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాదులకు సెప్టెంబర్ 4, 2025న జరిగే తదుపరి విచారణలో తమ స్పందనను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే దీనిపై ప్రభుత్వం ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి