Supreme Court On Stubble Burning: కొందరిని జైలుకు పంపితేనే... పంట వ్యర్ధాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:20 PM
వ్యర్థ పదార్ధాలను తగులబెట్టేందుకు బయోఫ్యూయెల్స్ వాడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయని సీజేఐ అన్నారు. రైతులు ప్రత్యేకమైన వారే, వాళ్ల వల్లే మనకు అన్నం దొరుకుతుంది. అలాగని పర్యవారణాన్ని పాడుచేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: పంట వ్యర్థాల దహనం (Stubble Burning)పై దాఖలైన పిటిషన్లపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు పాల్పడుతున్న కొంతమందినైనా జైలుకు పంపితేనే మిగితా వారికి గట్టి సందేశం ఇచ్చినట్టవుతుందని వ్యాఖ్యానించింది. రైతులు మనకు అన్నం పెడుతున్నారని, అయితే దాని అర్థం పర్యావరణాన్ని పాడు చేస్తుంటే సైలెంట్‌గా చూస్తూ ఉండమని కాదని సీజేఐ (CJI) బీఆర్ గవాయ్ (BR Gavai) అన్నారు.
పంట వ్యర్థాలను తగులబెట్టకుండా రైతులకు సబ్సిడీలు, వివిధ పరికరాలు అందిస్తున్నట్టు కోర్టుకు అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ తెలిపారు. అయితే ఉపగ్రహాలు ఆయా ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు కాకుండా మిగిలిన సమయాల్లో పంట వ్యర్థాలను కాల్చుకోవచ్చని అధికారులు తమకు చెప్పినట్టు రైతులు పదేపదే చెబుతున్నారని, దీనిపై ఎన్నిసార్లు ఉత్తర్వులు ఇచ్చినా ప్రయోజనం ఉండటం లేదని విన్నవించారు. దీంతో సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. కొందరినైనా జైలుకు పంపితేనే తక్కినవారికి సరైన సందేశం వెళ్తుందన్నారు. రైతులపై జరిమానా విధించే ఆలోచన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పర్యావరణాన్ని పరరిక్షించాలనే నిజమైన ఉద్దేశమే ఉంటే మీరెందుకు ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని నిలదీశారు.
వ్యర్థ పదార్ధాలను తగులబెట్టేందుకు బయోఫ్యూయెల్స్ వాడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయని సీజేఐ అన్నారు. రైతులు ప్రత్యేకమైన వారే, వాళ్ల వల్లే మనకు అన్నం దొరుకుతుంది. అలాగని పర్యావరణాన్ని పాడుచేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా? అని ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాల్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో ఖాళీలు ఉండటంపైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజిమెంట్‌కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రతి ఏడాది శీతాకాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాతావరణ కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. పొల్యూషన్‌కు పంట వ్యర్థాలను తగులబెట్టడం ప్రధాన కారణంగా గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
గ్యాంగ్‌స్టర్ చోటారాజన్ బెయిలు రద్దు.. సుప్రీం సంచలన తీర్పు
అణు బెదిరింపులకు భారత్ భయపడదు: ప్రధాని మోదీ
Read Latest National News and Telugu News